
ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా:
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ... 'నేను ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నా. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. ఒక్క ఛాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటా. 2019 వన్డే ప్రపంచకప్‌లో విఫలమైన నేపథ్యంలో భారత్ నుంచి తొలగించేవరకు నాకు ఆ టీ20 జట్టుతో మంచి అనుబంధం ఉంది. ప్రపంచకప్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగే అవకాశముంది' అని అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన కార్తీక్.. ఇక అప్పటి నుంచి టీమిండియాకి దూరంగా ఉండిపోయాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా మారిపోవడంతో.. ఇక కార్తీక్‌కి ఛాన్స్ రావడం కష్టమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్‌లో రాణిస్తే:
'నేనింకా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నా. టీమిండియాకు టీ20ల్లో సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కావాలి. ఇప్పుడు జట్టు నిండా టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెనే ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మినహా మిడిల్ ఆర్డర్‌లో సరైన బ్యాట్స్‌మన్ లేరు. టాప్ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆయా జట్లకు ఒకటి నుంచి మూడు స్థానాల్లోనే బ్యాటింగ్ చేస్తున్నారు. రిషబ్ పంత్ ఒక్కడే నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాంటప్పుడు రాబోయే ఐపీఎల్‌లో రాణిస్తే.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది' అని వెటరన్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ తన తన మనసులోని మాటను వెల్లడించాడు.

మూడు ప్రపంచకప్‌లలో ఆడాడు:
'వ్యాఖ్యాతగా క్రికెట్ గురించి నాకు తెలిసింది మాట్లాడాలనుకున్నా. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ టెన్నిస్ వంటి ఇతర క్రీడల్లో.. ఆటగాళ్లు తాము ఆటకు దూరంగా ఉన్నప్పుడు వాఖ్యానం చేస్తుంటారు. ప్రస్తుత ఆటగాళ్లు వ్యాఖ్యానం చేయడం ప్రపంచ వ్యాప్తంగా సాధారణమే. ఒక్క భారత్‌లోనే అది రిటైర్మెంట్ అనంతరం చేసే పనిగా పరిగణిస్తారు. అలాంటి మూస ధోరణిని మార్చాలనుకుంటున్నా. నేను జట్టులో లేనప్పుడు సంతోషంగా కామెంట్రీ చెబుతా' అని డీకే చెప్పుకొచ్చాడు. డీకే 2007 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ ముగింపు దశలో ఉన్న అతడు చివరగా ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.

32 టీ20ల్లో 339 పరుగులు:
ఎంఎస్ ధోనీ కంటే ముందే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మాత్రం కొనసాగలేకపోయాడు. ధోనీ వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే టీమ్‌లోకి ఎంపికవుతూ వచ్చిన కార్తీక్.. ఆ తరవాత టీమిండియాకి దూరమైపోయాడు. ఇప్పుడు రిషబ్ పంత్ పోటీగా మారాడు. భారత్ తరఫున 32 టీ20 మ్యాచ్‌లాడిన కార్తీక్ 33.25 సగటుతో 339 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 42 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండగా.. కనీసం ఒక్క అర్ధ శతకం కూడా లేదు. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు.


Click it and Unblock the Notifications
