ముంబై: మనపై మనకు నమ్మకం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన దినేశ్ కార్తీక్.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరగనున్న అప్‌కమింగ్ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ ఆదివారం ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే వేర్వేరు జట్లను ప్రకటించింది.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన దినేశ్ కార్తీక్ మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. దేశవాళీతో పాటు ఐపీఎల్లో కూడా విఫలమవడం, కామెంటేటర్‌గా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. కానీ ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్‌లోకి వచ్చిన అతను అనూహ్య రీతిలో చెలరేగాడు. లోయరార్డర్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాలందించాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 57.40 సగటుతో 287 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 191.33గా ఉంది. దీన్నిబట్టే డీకే ఈ సీజన్లో ఎలా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఈ పెర్ఫామెన్స్‌తోనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన దినేశ్ కార్తీక్ మళ్లీ టీమిండి పిలుపును అందుకునన్నాడు. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు క్రికెట్ ప్రముఖులు కూడా అతడి ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీమిండియాకు ఎంపికయ్యాక దినేశ్ కార్తీక్ సైతం ఓ ట్వీట్ చేస్తూ అందరికి ధన్యవాదాలు తెలిపాడు. 'నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీ వెంటే వస్తాయి' అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. తాను ఇలాగే కష్టపడతానని వెల్లడించాడు. ఇక ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో.. ముంబై సహకారంతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది.