
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున దినేష్ కార్తీక్ ఫినిషర్ రోల్‌లో వీరోచితంగా ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అతని ప్రదర్శన వల్ల బీసీసీఐ టీమిండియాకు సెలెక్ట్ చేయడంతో అతను టీంలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక దినేష్ కార్తీక్ ఐపీఎల్ మరియు దక్షిణాఫ్రికా సిరీస్లో రాణించడంతో భారత క్రికెట్ అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. అలాగే అతని ఆట పట్ల మాజీ ఆటగాళ్లు కూడా ఇంప్రెస్ అయ్యారు. రాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో టీమిండియా తరఫున అతను మ్యాచ్ విన్నర్ రోల్‌లో కన్పించడం ఖాయమంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇకపోతే ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మొదటి T20 మ్యాచ్ టైంలో ప్లేయింగ్ XIలో ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ కార్తీక్ కీపర్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కార్తీక్‌ను అవుట్‌ఫీల్డర్‌గా ఉపయోగించారు. కానీ అతను ఐర్లాండ్ సిరీస్లో కీపర్‌గా వ్యవహరించడం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'దినేష్ కార్తీక్ కీపర్ గ్లవ్స్ ధరించాడు. కాబట్టి.. ఇషాన్ కిషన్ టీమిండియా వికెట్ కీపింగ్ ఎంపిక కాదు.. సంజూ శాంసన్ జట్టులో కూడా చేరలేదు. దీని అర్థం ఏంటంటే.. పంత్ అందుబాటులో లేకుంటే కార్తీక్ టీమిండియా ప్రధాన వికెట్ కీపర్ అన్నమాట. ఈ విషయం స్పష్టమౌతుంది.' అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు. కార్తీక్ ఈ మధ్యకాలంలో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. అతను ఐర్లాండ్‌కు వ్యతిరేకంగా మలాహిడ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు దిగాడు. అలాగే దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో తన తొలి హాఫ్ సెంచరీతో జట్టుకు ఫినిషింగ్ నాక్ అందించాడు.