WTC Final: 'అప్పటి టీమిండియాను చూడలేదు కానీ.. భారత క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ టెస్టు జట్టు'

చెన్నై: ప్రస్తుత టీమిండియాపై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు ఆడిన భారత టెస్టు జట్లలో కోహ్లీసేననే అత్యుత్తమ జట్టని పేర్కొన్నాడు. తాను 1971 నాటి అజిత్ వాడేకర్ టీమిండియాను చూడలేదని, ఇప్పుడున్న కోహ్లీసేన అన్నింటికన్నా ప్రత్యేకమైన జట్టని డీకే అభినందించాడు. ప్రస్తుత జట్టులో అద్భుతమైన పేసర్లు, బ్యాట్స్‌మన్‌లు, ఆల్‌రౌండర్‌లు ఉన్నారన్నాడు. అంతేకాకుండా జట్టులో కుర్రాళ్లు కూడా అవసరమైనంత మంది ఉన్నారని డీకే చెప్పుకొచ్చాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్కై స్పోర్ట్స్ కోసం వ్యాఖ్యానించడానికి 36 ఏళ్ల కార్తీక్ ఇంగ్లండ్ వెళుతున్న విషయం తెలిసిందే.

కోహ్లీసేన అత్యుత్తమ జట్టు:
దినేశ్ కార్తీక్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'టీమిండియా ఆడుతున్నప్పటి నుంచి ఇదే బలమైన టెస్టు జట్టుగా ఉండి ఉంటుంది. ఇప్పుడున్న జట్టులో అద్భుతమైన పేసర్లున్నారు. ప్రపంచశ్రేణి స్పిన్నర్లూ ఉన్నారు. మరోవైపు బ్యాటింగ్ లైనప్ కూడా ఎంతో బలంగా ఉంది. అంతేకాకుండా అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లు ఉన్నారు. దీంతో జట్టులో ఒక అదనపు బౌలర్ లేదా బ్యాట్స్‌మన్‌ను ఉపయోగించుకునే వీలుంది. భారత క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ జట్టని నేను భావిస్తున్నా. ఇది నిజమే కాబట్టి కోహ్లీసేన ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడుతోంది' అని అన్నాడు.

మూడు ఫార్మాట్లలోనూ బలంగా:
భారత జట్టు మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్లు, జూనియర్లతో ప్రతి ఫార్మాట్లలో కోహ్లీసేన అత్యంత బలంగా ఉంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో. రోహిత్ శర్మ, చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ లాంటి ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్‌లు.. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ లాంటి మ్యాచ్ విన్నింగ్ పేసర్లు.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లు జట్టుకు ఉన్నారు. రిషబ్ పంత్, గిల్, మొహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ లాంటి యువ ఆటగాళ్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు.

ఇంటా బయటా అద్భుతమైన విజయాలు:
భారత జట్టు గతకొన్నేళ్లుగా ఇంటా బయటా అద్భుతమైన విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో మినహా అన్ని టెస్టు సిరీస్‌లూ గెలుపొందింది. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఈనెల 18 నుంచి న్యూజిలాండ్‌తో తుది పోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన ఫైనల్లోనూ విజయం సాధించి తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకోవాలని తహతహలాడుతోంది. మరి కోహ్లీసేన ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలి.

డీకే కొత్త ఇన్నింగ్స్:
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు తోడుగా దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానం చేయబోతున్నాడు. సౌథాంప్టన్‌లో ఈనెల 18న ఆరంభమయ్యే ఈ చరిత్రాత్మక పోరులో వ్యాఖ్యాన బృందంలో భారత్ నుంచి సన్నీ, డీకేలకే చోటు దక్కింది. డీకే కొత్త ఇన్నింగ్స్‌లో ఎలా అలరిస్తాడో చూడాలి. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications