హైదరాబాద్: భారత్‌తో టెస్టు సిరిస్ ప్రారంభానికి ముందే ఆతిథ్య శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. గాలే వేదికగా జులై 26 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు జట్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ దూరమయ్యాడు.
అనారోగ్యం కారణంగా 27 ఏళ్ల చండీమాల్ శుక్రవారం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు భారత్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు శ్రీలంక బోర్డు అధికారులు అధికారిక ప్రకటన చేశారు.

చండీమాల్ న్యుమోనియాతో బాధపడుతున్నాడని అందులో పేర్కొన్నారు. అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను ఉపుల్ తరంగ నిర్వహిస్తాడని పేర్కొన్నారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టుకి చండీమాల్ కెప్టెన్‌గా వ్వవహరించిన సంగతి తెలిసిందే.
జింబాబ్వేతో జరిగిన ఈ ఏకైక టెస్టులో శ్రీలంక విజయం సాధించడంతో పాటు ఓ రికార్డుని కూడా సొంతం చేసుకుంది. టెస్టు మ్యాచ్‌కి ముందు జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 3-2తో కోల్పోవడంతో ఏంజెలో మాథ్యూస్ మూడు ఫార్మెట్లకు రాజీనామా చేశాడు.
దీంతో దినేశ్ చండీమాల్‌కు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జులై 26న తొలి టెస్టు ప్రారంభంకానుంది.