
శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక సోమవారం రికార్డ్ నెలకొల్పింది. 1992తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాపై శ్రీలంక జట్టు 500ప్లస్ పరుగులు నమోదు చేసింది. దిముత్ కరుణరత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు గత కొన్ని నెలలుగా పటిష్ఠంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టెస్టు మ్యాచ్ నాలుగో రోజు.. దినేష్ చండిమాల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక జట్టు ఈ ఫీట్ సాధించగలిగింది. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన దినేష్ చండీమాల్ మూడో రోజు మొత్తం క్రీజులో ఉండి సెంచరీ పూర్తి చేసుకోగా.. నాలుగో రోజు సైతం తన ఫామ్ కొనసాగించాడు.
206పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక 554పరుగులకు ఆలౌటైంది. గత వారం ఇదే వేదికగా జరిగిన తొలి టెస్టులో 10వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 190పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ 59పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ (24), ఉస్మాన్ ఖవాజా (29), స్టీవ్ స్మిత్ (0) ఔటయ్యారు. ప్రస్తుతం మార్నస్ లబూషేన్ (9నాటౌట్), ట్రావిస్ హెడ్ (0) క్రీజులో ఉన్నారు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85) తమ సెంచరీలను మిస్ అయ్యారు. వీరిని మిచెల్ స్వెప్సన్, నాథన్ లయాన్ 10ఓవర్ల వ్యవధిలో పెవిలియన్‌కు పంపించారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తరఫున అరంగేట్రం చేసిన కమిందు మెండిస్ (61)పరుగులతో మంచి నాక్ ఆడాడు. ఇక 1992లో ఆస్ట్రేలియాపై శ్రీలంక టెస్టుల్లో 500పరుగులకు పైచిలుకు స్కోరు చేయగలిగింది. అప్పట్లో అర్జున రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు 8వికెట్ల నష్టానికి 547పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంత భారీ స్కోరు చేసినప్పటికీ ఆ మ్యాచ్‌లో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
ఆ మ్యాచ్‌లో అలన్ బోర్డర్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 16పరుగుల తేడాతో గెలుపొందింది.
ఆనాటి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు బ్యాటర్లు మొదటి ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేశారు. కెప్టెన్ అర్జున రణతుంగ (127), అసంక గురుసిన్హా (137), రొమేష్ కలువితారణ (132నాటౌట్) రాణించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో.. గ్రెగ్ మాథ్యూస్, షేన్ వార్న్‌ల దెబ్బకు శ్రీలంక కుప్పకూలింది. కేవలం 164పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ 16పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.