
అక్టోబర్ నెల చివర్లో టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఈవెంట్ కోసం బీసీసీఐ.. భారత జట్టును ప్రకటించింది. ఇక తీవ్రమైన వెన్ను గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా ఈవెంట్‌కు మిస్సయ్యాడు. దీంతో అతని స్థానంలో ఎవరినీ తీసుకుంటారోననే విషయమై ఇంకా స్పష్టత లేదు. దీపక్ చాహర్ లేదా మహ్మద్ షమీ తుది జట్టులోకి వస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను టీ20ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ప్లేయర్ దిలీప్ వెంగ్ సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా ఉమ్రాన్ మాలిక్ నిలిచాడు. ఆడిన 14మ్యాచ్‌ల్లో 22వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇకపోతే తన స్పీడ్‌తో విశ్లేషకులను, మాజీ ప్లేయర్లను సైతం మంత్రముగ్ధుల్ని చేశాడు. 150కి.మీల వేగంతో బంతులు కన్సిస్టెన్సీగా విసిరే అతని నైపుణ్యాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు మెచ్చుకున్నారు. అతను ఐర్లాండ్ పర్యటనలో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్ కూడా ఆడాడు. అయితే ధారాళంగా పరుగులిస్తుండడంతో అతన్ని సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టింది.
అయితే స్పీడ్ వల్ల ఉమ్రాన్ మాలిక్‌ను తప్పకుండా జట్టులోకి తీసుకోవాలని వెంగ్‌సర్కార్ తెలిపాడు. మాజీ సెలెక్టర్‌గా పనిచేసిన అతను స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. స్పీడ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున అతన్ని జట్టులోకి ఎంపిక చేసి ఉండాల్సిందన్నాడు. 'అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ లేదు. ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ వల్ల తప్పకుండా నేనేతై అతన్ని జట్టులోకి తీసుకునేవాడిని. అతను 150కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తున్న వ్యక్తి. ఇప్పుడు జట్టుకు ఆసీస్ పిచ్‌లపై కావాల్సింది స్పీడే. అందుకే అతనిని ఎంచుకోవాలి. మీకు పేస్‌లో బ్యాటర్లను ఇబ్బంది పెట్ట గల అల్ట్రా ఫాస్ట్ బౌలర్లు కావాలి.' అని దిలీప్ వెంగ్ సర్కార్ అన్నాడు. అలాగే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన 15మంది సభ్యుల జట్టులో శుభ్‌మాన్ గిల్, షమీ కూడా బాగుండేదని ఆయన అన్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడని అయితే తాను మాత్రం గిల్‌కే కట్టుబడి ఉంటానని' వెంగ్‌సర్కార్ అన్నాడు.