'వారిని గంగూలీ తక్కువ అంచనా వేస్తున్నారా.. లేదా ఆయనకే ఎక్కువ తెలుసనుకుంటున్నారా?'

ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వైఖరి తనకు నచ్చడం లేదు అని టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సునీల్ జోషి, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్‌ను గంగూలీ తక్కువ అంచనా వేస్తున్నట్టు కనిపిస్తోందని వెంగ్‌సర్కార్ విమర్శించారు. ప్రతి విషయానికీ అతడే స్పందిస్తున్నాడని, మిగతా వారికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. దాదాలోని ఈ వైఖరి తనకు నచ్చడం లేదని వెంగ్‌సర్కార్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఐపీఎల్ 2020 షెడ్యూల్ దగ్గరినుంచి ఆస్ట్రేలియా పర్యటన వరకు అన్ని దాదానే మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా జోషి, బ్రిజేశ్ మాటే వినబడట్లేదు.

ఆయనకే ఎక్కువ తెలుసని అనుకుంటున్నారా:
దిలీప్ వెంగ్‌సర్కార్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'సెలక్టర్ల కమిటీ ఛైర్మన్ సునిల్ జోషీ బదులు సౌరవ్ గంగూలీయే మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. ఒక ఆటగాడిని ఎందుకు వదిలేశారు, మరో ఆటగాడిని ఎందుకు తీసుకోలేదు, ఇంకొకరు ఫిట్‌గా లేకున్నా అతడిని తీసుకొని మరొకరిని మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో వంటివన్నీ ఆయనే వివరిస్తున్నాడు. ఐపీఎల్ షెడ్యూలు, తేదీలు, వేదికల గురించీ బ్రిజేశ్ పటేల్ కాకుండా దాదాయే మాట్లాడాడు. వారు సొంతగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. వివరణ ఇచ్చుకోగలరు. వారిని దాదా తక్కువ అంచనా వేస్తున్నారా? లేదా ఆయనకే ఎక్కువ తెలుసని అనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు.

గంగూలీ నుంచి ఎంతో ఆశించా:
'బీసీసీఐని ఓ మాజీ క్రికెటర్ నడిపిస్తే బాగుంటుందని గతంలో నేను అనుకున్నా. సౌరవ్ గంగూలీ నుంచి ఎంతో ఆశించా. ఏదేమైనా నేను ఇప్పటివరకు చాలా చూశా. ఇప్పుడు నా మనసు మార్చుకున్నా. ఇక రోహిత్ శర్మ గాయం విషయంలోనూ బీసీసీఐ వైద్య బృందం అందరినీ గందరగోళంలోకి నెట్టేసింది. బీసీసీఐ ఫిజియో అతడు ఫిట్‌గా లేడని ప్రకటిస్తే.. ముంబై ఇండియన్స్ ఫిజియో మాత్రం బాగున్నాడని డిక్లేర్ చేశాడు. ఇద్దరి ఫిజియోల మధ్య ఎందుకింత తేడా ఉంది. గంగూలీ ఇందుకు ఏమని బదులిస్తాడు' అని వెంగ్‌సర్కార్ మండిపడ్డారు.

భారత జట్లలో మార్పులు:
ఇదివరకు ఆసీస్ టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్లలో బీసీసీఐ సోమవారం మార్పులు చేసింది. గాయం కారణంగా టూర్‌కు తొలుత ఎంపిక కాని ఓపెనర్ రోహిత్ శర్మను టెస్టు సిరీస్ కోసం తీసుకుంది. అతడికి పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది. భారత జట్టుకు తొలిసారి ఎంపికైన నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా టీ20 టీమ్‌లో చోటు కోల్పోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన టీ నటరాజన్ బెర్తు దక్కించుకున్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరిలో తండ్రి కాబోతుండడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ (పెటర్నటీ) సెలవులు మంజూరు చేసింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మూడు టెస్టులకు విరాట్ దూరం కానున్నాడు. రోహిత్ విషయంలో బీసీసీఐపై విమర్శల వచ్చిన నేపథ్యంలో జట్టులో మార్పులు చేసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా యూఏఈ నుంచే ఆస్ట్రేలియా వెళ్లనుంది.
IPL 2020 బెస్ట్ ఎలెవన్.. తెవాటియాకు ఛాన్స్.. కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications