'పుజారా నా వన్డే జట్టులో ఎప్పుడూ ఉంటాడు.. అతన్ని నా జట్టు నుంచి ఎప్పటికీ తీయను'

ఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో టెస్టు ఆటగాడిగా చతేశ్వర్ పుజారాపై ముద్ర పడింది. నిజం చెప్పాలంటే అదే అతని కెరీర్‌కు తీవ్ర నష్టం చేసింది. సుదీర్ఘ ఫార్మాట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉండే పుజారా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అది కూడా ఐదు వన్డేలు. పుజారా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోడనే అపవాదుతో అతన్ని కనీసం ఐపీఎల్‌లో కూడా ఏ ప్రాంచైజీ పరిశీలించడం లేదు. తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోతానని ఎంత మొత్తుకున్నా.. భారత జట్టులో కానీ ఐపీఎల్‌లో కానీ ఎవరూ అవకాశం ఇవ్వట్లేదు.

నా జట్టులో ఎప్పుడూ ఉంటాడు:
అయితే చతేశ్వర్ పుజారాకు తన వన్డే జట్టులో ఎప్పుడూ చోటు ఉంటుందని టీమిండియా మాజీ స్పిన్నర్ దిలీప్ జోషీ అంటున్నాడు. 'చతేశ్వర్ పుజారా నా వన్డే జట్టులో ఎప్పుడూ ఉంటాడు. అతన్ని నా వన్డే జట్టు నుంచి ఎప్పుడూ తీయను. అవసరమైతే ఇన్నింగ్స్ చివరి వరకూ పుజారానే క్రీజులో ఉండమని అడుగుతా. పుజారా 50 ఓవర్ల పాటు సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేయడంలో దిట్ట. టెస్టు క్రికెట్‌లో అవసరమైన ఆటగాడు వన్డేలకు ఎందుకు పనికిరాడో నాకు ఇప్ప్పటికీ అర్థం కావడం లేదు' అని దిలీప్ జోషీ అన్నాడు.

చాలెంజ్ అంటే అదే:
'ఒకే తరహా బ్యాటింగ్ చతేశ్వర్ పుజారాకు శత్రువులా మారింది. పుజారా లాంటి హై ప్రొఫైల్ ఆటగాడు చాలా నెమ్మది అంటూ అవకాశాలు ఇవ్వకపోవడం నాకు బాధనిపిస్తోంది. టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత గేమ్ స్వరూపమే మారిపోయింది. నాకు తెలిసినంత వరకూ ఒక మంచి క్లబ్ నుంచి వచ్చిన నాణ్యమైన ఆటగాడు టీ20ల్లో ఫిట్ అవుతాడనే విషయం తెలుసుకోవాలి. అసలు సిసలు చాలెంజ్ అంటే అది టెస్టు క్రికెట్ అని విషయం క్రికెట్ పెద్దలు గుర్తించాలి' అని దిలీప్ జోషీ పేర్కొన్నాడు.

521 పరుగులతో టాప్ స్కోరర్‌గా:
భారత్ తరఫున కేవలం టెస్టులు మాత్రమే చతేశ్వర్ పుజారా ఆడుతున్నాడు. టీమిండియా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడబోతోంది. దీంతో ఇప్పటి నుంచే పుజారా ప్రాక్టీస్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. 2018-19 పర్యటనలో కోహ్లీసేన 2-1తో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో పుజారా అద్భుతంగా ఆడాడు. 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

77 టెస్టుల్లో ప్రాతినిథ్యం:
టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్ పుజారా 48.86 సగటుతో 5,840 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు (3 డబుల్ సెంచరీలు), 25 అర్థ సెంచరీలున్నాయి. ఇక 5 వన్డేలు ఆడి 51 రన్స్ చేసాడు. ఇక దిలీప్ జోషీ 33 టెస్టులు, 15 వన్డేలకు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications