
హైదరాబాద్: ఆసియా కప్ కోసం ఇటీవల ప్రకటించిన భారత జట్టు ఎంపికపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. పరుగులు చేసే వారికి కాకుండా.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశాలు ఎలా ఇస్తారని భజ్జీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.
సెప్టెంబర్ 15 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగే ఆసియా కప్ కోసం ఇటీవలే సెలక్టర్లు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేశారు అప్పగించారు.
ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసియా కప్‌లో భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు జట్టు ఎంపిక సరిగా లేదని హర్భజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. జట్టు సభ్యుల వివరాలు ఉన్న ఫోటోని ట్వీట్ చేసిన భజ్జీ "ఇందులో మయాంక్ అగర్వాల్ ఎక్కడ? ఎన్నో పరుగులు చేసినప్పటకీ.. అతని పేరు నాకు జట్టులో కనిపించడం లేదు. ఒక్కో వ్యక్తికి.. ఒక్కో రూల్స్ ఉంటాయి అనుకుంటా" అని కామెంట్ పెట్టాడు.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు భజ్జీకి మద్దతుగా నిలిచారు. జట్టు సెలెక్షన్‌లో బీసీసీఐ రాజకీయాలు చేస్తుందని, అందుకే అర్హత ఉన్న వారికి కాకుండా.. తమకు ఇష్టమైన వాళ్లకి జట్టులో అవకాశం ఇస్తున్నారంటూ కామెంట్లు పోస్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.