మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. దంబుల్లా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది.ఆల్‌రౌండర్ షోతో సత్తాచాటి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. సిద్రా అమీన్ (25; 35 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆఖర్లో ఫాతిమా సాహా (22 నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా పరుగులు చేసింది.
దీప్తి శర్మ (3/20) మూడు వికెట్లతో చెలరేగింది. రేణుక ఠాకూర్ (2/14), పూజ వస్త్రాకర్ (2/31), శ్రేయాంక పాటిల్ (2/14) తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45; 31 బంతుల్లో, 9 ఫోర్లు), షెఫాలీ వర్మ (40; 29 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) విజృంభించారు. ఛేదన ఆరంభం నుంచే ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో భారత్ పవర్‌ప్లేలోనే 57 పరుగులు సాధించింది.

కాగా, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ నిధా దర్ తమ ఓటమికి గల కారణాలు వివరించింది. పవర్‌ప్లేలో పేలవమైన ప్రదర్శనే తమ జట్టు ఓటమికి కారణమని పేర్కొంది. తొలి ఆరు ఓవర్లలో బ్యాటింగ్, బౌలింగ్‌లో పాక్ విఫలమైంది. పవర్‌ప్లేలో బ్యాటుతో 37/2 చేసిన పాక్ బంతితో 57 పరుగులు సమర్పించుకుంది. ''ఇరు జట్ల మధ్య వ్యత్యాసం పవర్‌ప్లే. ఇదే మా ఓటమికి కారణం. మేం బ్యాటుతో విఫలమయ్యాం. కాస్త సానుకూలాంశం ఏంటంటే బౌలింగ్. మా బౌలర్లు ఫర్వాలేదనిపించారు''
''మా ఓటమిపై జట్టుగా కలిసి విశ్లేషించుకుంటాం. వచ్చే మ్యాచ్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. టీ20ల్లో పవర్‌ప్లే చాలా కీలకం. పవర్‌ప్లేలో పైచేయి సాధిస్తే మ్యాచ్‌లను గెలవచ్చు. ఇక వికెట్‌ను కూడా మేం మరింత అర్థం చేసుకుని మిగిలిన మ్యాచ్‌లకు సన్నద్ధం కావాలి'' అని నిధా దర్ పేర్కొంది. పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో నేపాల్‌తో ఆదివారం తలపడనుంది.