183 ఆటోగ్రాఫ్‌లే 'ధోనీ' వీరాభిమాని లక్ష్యం.. ఇప్పటికి ఎన్ని తీసుకున్నాడో తెలుసా?

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత దేశంలో అయితే పిచ్చి పీక్‌లో ఉంటుంది. ధోనీ ఆరంగేట్రం నుంచి ఇప్పటివరకు తన బ్యాటింగ్, కీపింగ్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. మరోవైపు కూల్ కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచాడు.

ధోనీ వీరాభిమాని ప్రణవ్:
టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2001) టీమిండియాకు అందించడంతో అభిమాన సంఖ్య మరింత పెరిగింది. అభిమానులకు ధోనీ అంటే పిచ్చి ఉండడంతో.. అతన్ని కలవాలని చూస్తుంటారు. మరికొందరు అభిమానులు అయితే సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలో ఉన్న ధోనీ కాళ్లను తాకి సంబరపడిపోతుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ధోనీ వీరాభిమాని ప్రణవ్ జైన్ కాస్త కొత్తగా ఆలోచించాడు.

183 ఆటోగ్రాఫ్‌లే లక్ష్యం:
తనకు ఇష్టమైన ధోనీ నుండి 183 ఆటోగ్రాఫ్‌లు సేకరించాలని ప్రణవ్ జైన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రణవ్ ఖాతాలో 153 ఆటోగ్రాఫ్‌లు ఉన్నాయి. మరికొన్ని ఆటోగ్రాఫ్‌ల కోసం ప్రస్తుతం అతడు కోల్‌కతాలో ఉన్నాడు. ఈసారి కనీసం 10 ఆటోగ్రాఫులైనా సేకరించాలని ప్రణవ్ తహతహలాడుతున్నాడు. మాజీ దిగ్గజం కపిల్ దేవ్‌తో కలిసి ఒక వాణిజ్య షూటింగ్‌లో పాల్గొనేందుకు ధోనీ కోల్‌కతాకు వచ్చాడు.

ధోనీ మాటిచ్చాడు:
తాజాగా ప్రణవ్ మాట్లాడుతూ... 'ధోనీ భాయ్ నాకు 183 ఆటోగ్రాఫ్‌లు ఇస్తానని మాటిచ్చాడు. అయితే మొత్తం ఇచ్చేసిన తర్వాత మరో ఆటోగ్రాఫ్ అవ్వనని కూడా చెప్పాడు. ఒకప్పుడు ఆటవిడుపుగా ఆటోగ్రాఫ్‌లు సేకరించేవాడిని. అదే ఇప్పుడు ఓ అలవాటుగా మారిపోయింది. నా లక్ష్యం నెరవేరేందుకు మరో ఏడాది సమయం పడుతుంది అనుకుంటున్నా' అని తెలిపాడు. ధోనీతో పాటు ప్రపంచమంతా తిరిగిన ప్రణవ్.. గ్లోవ్స్, బ్యాట్లు, పోస్టర్లు, స్కెచ్‌ల లాంటి వస్తువులపై సంతకాలు తీసుకున్నాడు.

అవినాభావ సంబంధం:
ధోనీ, 183 సంఖ్యకు ఓ అవినాభావ సంబంధం ఉంది. ధోనీకి వన్డేల్లో అత్యధిక స్కోరు 183. అందుకే అతడి వీరాభిమాని ప్రణవ్ జైన్ తన ఆరాధ్యుడి నుంచి 183 ఆటోగ్రాఫ్‌లు సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వన్డేల్లో చేసిన అత్యధిక స్కోరు 183. 1983 ప్రపంచకప్‌లో భారత్ కాపాడుకున్న లక్ష్యం కూడా 183నే.

నిరవధిక విరామం:
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమి పాలైన తర్వాత ధోనీ నిరవధిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవలే మహీ ముంబైలో మీడియాతో మాట్లాడాడు. ఓ జర్నలిస్ట్ క్రికెట్ కెరీర్ భవితవ్యం గురించి ప్రశ్నించగా.. 'జనవరి వరకు నన్నేమీ అడగొద్దు' అని బదులిచ్చాడు. గత నెలలో ఝార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోనీ సాధన చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications