డబ్బు రాలేదు, గౌరవం వచ్చింది.. 83 చిత్రంపై కబీర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

క్రికెట్‌లో టీమిండియా మొదటి ప్రపంచకప్ గెలిచిన అంశంపై తెరకెక్కిన చిత్రం 83. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రముఖ భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేశారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా కబీర్ ఖానే కావడం గమనార్హం. ఈ చిత్రంలో అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించాడు. అయితే ఈ చిత్రం గురించి కపిల్ దేప్ తనతో మాట్లాడిన ఆసక్తిర విషయాలను దర్శకుడు, నిర్మాత కబీర్ ఖాన్ తాజాగా వెల్లడించాడు.

థర్డ్ వేవ్ ప్రభావం
కరోనా మహమ్మారి మూడో వేవ్ కారణంగా 83 చిత్రం విడుదలైన కొన్ని రోజులకే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయని కబీర్ ఖాన్ తెలిపాడు. కాగా ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం 83 సినిమా ప్రదర్శనపై పడిందని చెప్పాడు. కలెక్షన్లు అనుకున్నంతగా రాకపోవడంతో తాను నిరుత్సాహానికి గురయ్యానని ఆయన తెలిపాడు. అయితే సినిమాను అప్పుడు విడుదల చేయాలని ఒక్క సారిగా తీసుకున్న నిర్ణయం కాదని బాగా ఆలోచించే తీసుకున్నామని చెప్పాడు.

ఆ వార్తలు చదివి నిరాశ చెందేవాన్ని
కలెక్షన్లు బాగా లేనప్పటికీ సినిమాను ఇప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకోవడం లేదని, మరి కొన్ని రోజులు వేచి చూసాకే ఓటీటీలో విడుదల చేస్తామని కబీర్ ఖాన్ తెలిపాడు. ప్రతిరోజూ నిద్రలేచి మరో రాష్ట్రంలో ఆంక్షలు విధించడం, మరో రాష్ట్రంలో థియేటర్‌లను మూసేయడం, మరో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించడం వంటి వార్తలు చదువుతున్నప్పుడు తీవ్రంగా నిరాశ చెందే వాడినని చెప్పుకొచ్చాడు. అప్పుడు రోజంతా ఆ వార్తలకు సంబంధించిన మెసేజ్‌లను చదవడంతోనే అయిపోయేదని కబీర్ ఖాన్ చెప్పాడు.

డబ్బు రాలేదు, గౌరవం వచ్చింది
ఆ సమయంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తనతో చెప్పిన మాటలను కబీర్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ''కబీర్.. మీకు ఇప్పటికే మీ ప్రపంచ కప్ వచ్చింది. మీరు తీసిన ఈ సినిమానే మీ ప్రపంచకప్. ప్రపంచకప్ గెలిచినప్పుడు మాకు డబ్బు రాలేదు, గౌరవం మాత్రమే వచ్చింది, ఆ గౌరవం వల్లే మీరు మాపై ఈ సినిమా తీశారు. మీరు డబ్బు గురించి మరచిపోండి, మీకు వచ్చే గౌరవంపై దృష్టి పెట్టండి'' అని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తనతో చెప్పాడని కబీర్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. కపిల్ దేవ్ చెప్పినట్టుగా 83 చిత్రంతో తనకు డబ్బులు రాలేదు కానీ, గౌరవం వచ్చిందని నిర్మాత్ కబీర్ ఖాన్ చెప్పాడు.

కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్
కాగా 1983 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా అండర్ డాగ్‌గా బరిలోకి దిగి టోర్నీ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ విజయం ఆధారంగా తెరకెక్కిన 83 చిత్రంలో కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించాడు. మిగతా పాత్రల్లో సకీబ్ సలీమ్, హార్డీ సంధు, అమ్మీ విర్క్, సాహిల్ ఖట్టర్, చిరాగ్ పాటిల్, జీవా, పంకజ్ త్రిపాఠి, దీపికా పదుకొనే తదితరులు నటించారు. డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటిందని కబీర్ పేర్కొన్నాడు. అలాగే అంతర్జాతీయంగా రూ. 200 కోట్ల మార్కును చేరుకుంటోందని ఆయన తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications