బెంగళూరు: కొద్ది గంటల క్రితం(అక్టోబర్ 20, మధ్యాహ్నం) ఐపిఎల్‌తోపాటు అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్ దిగ్గజం వీవ్ రిచర్డ్స్‌తో సెహ్వాగ్‌ని పోల్చాడు ధోనీ.
కాగా, 'థాంక్యూ సెహ్వాగ్' అంటూ సెహ్వాగ్‌కు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్లో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
ధోనీ కూడా ట్వీట్టర్ ద్వారా సెహ్వాగ్‌ను కొనియాడాడు. 'వీవ్ రిచర్డ్స్ బ్యాటింగ్ చూడలేదు. కానీ, సెహ్వాగ్ ఆట తీరును చూస్తే ఆ లోటు తీరిపోతుంది. ఎంత కఠినమైన బౌలింగ్‌నైనా సెహ్వాగ్ ఎదుర్కొని వారిని బెంబేలెత్తించేవాడు. వారి బౌలింగ్ దాడిని తూనాతునకలు చేసేవాడు' అని ధోనీ పేర్కొన్నాడు.

'ఎంతో ప్రతిభావంతుడైన విరూప(సెహ్వాగ్) తన దైన మైండ్ సెట్‌తో బౌలర్లపై విరుచుకుపడేవాడు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు' అని చెప్పాడు.
'మేము ఎప్పుడూ సింగిల్స్ తీస్తూ పాజిటివ్‌గా ఉండాలని చెబుతుండేవారిమి. కానీ, సెహ్వాగ్ ప్రతీ బంతిని బౌండరీ దాటించేందుకు ప్రయత్నించేవాడు. అయితే తను బ్యాటింగ్ ఎంజాయ్ చేయాలని కోరుకునేవాడిని. చాలా మంది నీ(సెహ్వాగ్)లా ఆడాలని ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. అద్భుతమైన కెరీర్‌కు శుభాకాంక్షలు' అని ధోనీ పేర్కొన్నాడు.
టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, మాజీ టెస్ట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, , బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, తదితర ప్రముఖ వర్తమాన, మాజీ ఆటగాళ్లు కూడా సెహ్వాగ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
సెహ్వాగ్‌కు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. 'మోడర్న్ డే వీవ్ రిచర్డ్స్', 'ముల్తాన్ కా సుల్తాన్', 'నవాబ్ ఆఫ్ నజఫ్‌గఢ్' అని పిలుస్తుంటారు. టీమిండియా ఆటగాళ్లు మాత్రం ప్రేమగా 'విరూప' అని పిలుచుకుంటారు.