హైదరాబాద్: భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన మహేంద్ర సింగ్ ధోని బుధవారం ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. అయితే ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు.

ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 'పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించి కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన ధోనికి అభినందనలు. కెరీర్ తొలి నాళ్లలో దూకుడైన వ్యక్తిత్వం నుంచి కెప్టెన్ కూల్‌గా తీసుకున్న బాధ్యతాయుత నిర్ణయాల వరకు అతన్ని నిశితంగా గమనించాను. అతని విజయవంతమైన కెప్టెన్సీ రికార్డును అభినందిస్తూ వీడ్కోలు నిర్ణయాన్ని గౌరవిద్దాం' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
రవీంద్ర జడేజా తన ట్విట్టర్‌లో 'బెస్ట్ కెప్టెన్.. బెస్ట్ వికెట్ కీపర్.. బెస్ట్ ఫినిషర్. భారత్ క్రికెట్‌ను సరికొత్త పుంతలు తొక్కించావు. నీవులేని లోటు తెలుస్తుంది' అని ట్వీట్ చేశాడు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ 'టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు భారత్‌కు అందించిన గొప్ప కెప్టెన్ ధోనీ. అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ధోని భార్య సాక్షి సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'ధోని ఎక్కే పర్వతాలు ఏమీ లేవు. అందుచేత అతన్నే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ధోని నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచించే తీసుకుంటాడు. నా భర్త ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టుగానే ఉంటుంది' అని సాక్షి ట్వీట్ చేసింది.
అయితే ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు గంగూలీ 2000లో కెప్టెన్సీ భాద్యతలు స్వీకరించినప్పుడు భారత జట్టు టెస్టు ర్యాంక్ 8 ఉండిందని, కానీ వైదొలిగే సమయానికి ర్యాంక్ 2కి చేరుకుందని ఉన్న ఒక ట్వీట్‌ను మాత్రం రీట్వీట్ చేశాడు సెహ్వాగ్.