యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగియడానికి టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లినే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు చేశాడు. అప్పట్లో యువరాజ్ మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ, అతడికి ఫిట్‌నెస్ పరీక్షల్లో ఎలాంటి వెసులుబాటు కల్పించలేదని అన్నాడు.
యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు బంతులు ఆరు సిక్స్ లు అనగానే టక్కున అతడి పేరే ముందుగా క్రికెట్ అభిమానులకు గుర్తుకొస్తది. వన్డే, టీ20 ప్రపంచ కప్‌లను టీమ్ ఇండియా విజయం సాధించడంలో యువీది కీలక పాత్ర. ఈ రెండు వరల్డ్ కప్‌లను కూడా ధోనీ నాయకత్వంలో భారత జట్టు దక్కించుకుంది.

అయితే తాజాగా యూవీ కెరీర్ పై సారథిగా కోహ్లీ వ్యవహరించిన తీరు సరైనది కాదంటూ ఉతప్ప అన్నాడు. క్యాన్సర్ ను జయించి 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి యూవీ పునరాగమనం చేసినప్పుడు అతడికి విరాట్ మద్దతుగా నిలవలేదని గుర్తు చేశాడు. కెప్టెన్సీని కోహ్లీ, రోహిత్ ను పోల్చే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. సారథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మార్గాలు భిన్నమైనవని పేర్కొన్నాడు.
"క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలనుకున్నాడు. అతడు రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అతడు కేవలం టోర్నమెంట్ లు మాత్రమే గెలవలేదు. క్యాన్సర్ ను కూడా జయించాడు. జీవితంలో అత్యంత కష్టమైన దశను అధిగమించాడు. అలాంటి వ్యక్తికి జట్టులో అవకాశం ఇవ్వలేదు.వీటి గురించి ఎవరూ నాకు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. నేను గమనించిన విషయాలను మాత్రమే చెబుతున్నాను.

యువీకి అప్పుడు లంగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఫిట్ నెస్ విషయంలో రెండు పాయింట్ల తగ్గింపు కోసం యూవీ అభ్యర్థించినప్పుడు దానిని ఇవ్వలేదు. అయినా కూడా అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించి టెస్ట్ ఆడాడు. పైగా అప్పటి కెప్టెన్ ఎవరూ కూడా యూవీకి మద్దతుగా నిలవలేదు. చివరికి యూవీ జట్టులో నుంచి వెళ్లిపోయాడు.
ఆ సమయంలో కెప్టెన్ గా ఉన్న కోహ్లీ, అందరూ తనలాగే ఉండేలా ప్లేయర్ల ఫిట్ నెస్, ఆహారపు అలవాట్లకు పెద్ద పీట వేశాడు. విరాట్ ప్రతిఒక్కరు తన ప్రమాణాలను చేరుకోవాలని కోరుకుంటాడు. అది క్రికెటైనా, ఫిట్‌నెస్ లేదా ఇతర ఏదైనా విషయమైనా. అందరూ అవే స్టాండర్డ్స్ పాటించాలని బలంగా అనుకుంటాడు. కానీ రోహిత్ శర్మ అందరినీ కలుపుకొని పోయే స్వభావం కలిగిన కెప్టెన్ " అని ఉతప్ప అన్నాడు.