For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జాఫర్‌ మంచి ప‌ని చేశావ్‌.. నా మద్దతు నీకే: కుంబ్లే

Did the right thing: Anil Kumble and Irfan Pathan backs Wasim Jaffer

ముంబై: దేశవాళీ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ టెస్ట్ ఓపెనర్ వసీం జాఫర్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మద్దుతుగా నిలిచారు. ఉత్త‌రాఖండ్ క్రికెట్ టీమ్ కోచ్ ప‌ద‌వికి జాఫ‌ర్ రాజీనామా చేయ‌డం స‌రైన‌దే అని కుంబ్లే అన్నారు. సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్త‌రాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఎంపికలో ఓ మతానికి చెందిన ఆటగాళ్లకు జాఫర్ ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ఉత్త‌రాఖండ్ రాష్ట్ర క్రికెట్‌ సంఘం అధికారులు ఆరోపణలు చేశారు.

తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై వసీం జాఫర్‌ స్పందించాడు. 'మతపరమైన అంశాలను క్రికెట్లోకి తీసుకురావడం చాలా బాధ కలిగిస్తోంది. ఇక్బాల్‌ అబ్దుల్లాను కెప్టెన్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. జై బిస్టాను కెప్టెన్‌గా నియమించాలని నేను అనుకున్నా. కానీ సెలక్టర్లంతా కలిసి ఇక్బాల్‌ను కెప్టెన్‌ చేయమని సూచించారు. సీనియర్‌ ఆటగాడైన అతనికి ఐపీఎల్‌ ఆడిన అనుభవం కూడా ఉందని చెప్పడంతో నేను సరేనన్నా' అని జాఫర్‌ తెలిపాడు.

'బయో బబుల్‌ల్లోకి మత గురువులను తీసుకొచ్చానని, అక్కడ మేం నమాజ్‌ చేశామని సంఘం అధికారులు అంటున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. దెహ్రాదూన్‌లో శిబిరం సందర్భంగా 2-3 శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు. నేను ఆయనను పిలవలేదు. శుక్రవారం ప్రార్థనల కోసం ఇక్బాల్‌ అబ్దుల్లా నాతో పాటు మేనేజర్‌ అనుమతి కోరాడు. సాధన పూర్తయ్యాకే ప్రార్థనలు జరిగాయి. దీన్ని ఎందుకు ఇంత పెద్ద విషయం చేస్తున్నారో అర్థం కావట్లేదు' అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.

వసీం జాఫర్ వివరణపై టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'వసీం జాఫర్‌ నా మ‌ద్ద‌తు నీకే. ఉత్త‌రాఖండ్ క్రికెట్ టీమ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం స‌రైన‌దే. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్లేయ‌ర్స్ నీ కోచింగ్‌ను మిస్ అవుతారు' అని జంబో ట్వీట్ చేశారు. జాఫర్ ట్వీట్‌పై స్పందించిన మ‌రో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా అతడికి మ‌ద్ద‌తుగా నిలిచాడు. 'నువ్వు ఇలా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌రం' అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.

వసీం జాఫర్‌ గతేడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికారు. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించారు. రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్‌.. ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడారు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ జాఫర్‌ రికార్డు సృష్టించారు. తన క్రికెట్‌ కెరీర్‌లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్‌.. ఆ తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించారు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ జాఫర్‌ అరుదైన ఘనత అందుకున్నారు. 1996-97 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్‌.. మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19410 పరుగులు బాదారు. అందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉన్నాయి.

Story first published: Thursday, February 11, 2021, 18:38 [IST]
Other articles published on Feb 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+