ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ వివాదాస్పద అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. లక్నో గెలుపుకు కీలకమైన చివరి ఓవర్లో జరిగిన ఓ సంఘటన వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుందా అన్న చర్చ నెటిజన్ల మధ్య మొదలైంది. అసలేమైందంటే.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కొట్టిన బంతి బౌండరీ లైన్ దాటకముందే డగౌట్ లో ఉన్న అవేష్ ఖాన్ దానిని బ్యాట్‌తో తోసేశారని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
క్రికెట్ నియమ నిబంధనల ప్రకారం.. బౌండరీ బయట ఉన్న ఏ వ్యక్తి అయినా(ఫీల్డర్ కాకుండా డగౌట్లో ఉన్న ఆటగాళ్లు లేదా సిబ్బంది) ఉద్దేశపూర్వకంగా బంతిని తాకినా లేదా అడ్డుకున్నా దానిని అనధికారిక జోక్యం కింద పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో అంపైర్ ఆ బాల్‌ను 'డెడ్ బాల్'గా ప్రకటించడమే కాకుండా.. బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఆ బంతికి రావాల్సిన పరుగులు ఇవ్వరు. దీనికి తోడు ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ అవేష్ ఖాన్ బౌండరీ బయట ఉండి బంతిని అడ్డుకోవడంతో ఆ బౌండరీ రద్దయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ అప్పీల్ చేసి ఉంటే ఏమయ్యేది?
నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. ఆ సమయంలో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ లేదా ఆటగాళ్లు ఈ విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లి అప్పీల్ చేసి ఉండాల్సింది. ఒకవేళ అంపైర్లు అవేష్ ఖాన్ చర్యను ఉద్దేశపూర్వక జోక్యంగా భావించి ఉంటే.. లక్నోకు ఆ 4 పరుగులు వచ్చేవి కావు. పైగా పెనాల్టీ రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 5 రన్స్ వచ్చి ఉండేవని.. తద్వారా మ్యాచ్ సమీకరణాలు పూర్తిగా మారిపోయి సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే ఛాన్స్ ఉండేదని అభిమానులు వాపోతున్నారు. ఆ ఉత్కంఠ సమయాల్లో ఆటగాళ్లు ఆ విషయాన్ని గమనించకపోవడం హైదరాబాద్ కొంపముంచిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నిర్ణయాత్మక తప్పుగా మిగిలిపోతుందా?
సాధారణంగా ఐపీఎల్ వంటి హై-ప్రొఫైల్ టోర్నీల్లో ప్రతి రన్, ప్రతి నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి. ముఖ్యంగా చివరి ఓవర్లో ఇలాంటి నియమాలు పాటించకపోవడం వల్ల ఓ జట్టుకు అన్యాయం జరిగిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే అంపైర్లు దీనిని ఎందుకు గమనించలేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంఘటనపై జట్టు యాజమాన్యం ఎలాంటి స్పందని ఇవ్వకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం "SRH తన గెలుపు అవకాశాన్ని తన చేతులతోనే జారవిడుచుకుంది" అనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.