ఫోటోలు: ధోని నిర్ణయం వెనుక సెలక్టర్లు పాత్ర ఏమేరకు?
హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడం వెనుక సెలక్టర్లు కీలకపాత్ర పోషించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ధోని నిర్ణయం వెనుక బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.
జార్ఖండ్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా నాగ్ పూర్‌లో ఉన్న ధోనిని ఎమ్మెస్కే ప్రసాద్ కలవడం వెనుక కారణం కూడా ఇదేనని అంటున్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని ధోని కేవలం మూడంటే మూడే మాటల్లో తీసుకున్నట్లు తెలుస్తోంది.
పదేళ్ల పాటు టీమిండియా సారధిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలనందించాడు. బుధవారం సాయంత్రం తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ధోని హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం అతని అభిమానులేనే కాదు, యావత్ భారతదేశ క్రికెట్ అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది.
అయితే ధోని తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు బుధవారం ఉదయం నాగపూర్ శివారు జమ్తాలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉన్నాడు. అక్కడ గుజరాత్, జార్ఖండ్ మధ్య రంజీ సెమీ ఫైనల్ జరుగుతోంది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధోనిని అక్కడే కలిశాడు.

ఎమ్మెస్కే ప్రసాద్‌తో మాట్లాడిన ధోనీ
బుధవారం సాయంత్రం ఎమ్మెస్కే ప్రసాద్‌తో మాట్లాడిన ధోనీ ‘ఓకే దట్స్ ఇట్' అని చెప్పాడంతే. దాని అర్ధం ఏమిటంటే కెప్టెన్సీ నుంచి తాను తప్పుకున్నట్లు. సాధారణంగా ఇండియన్ క్రికెట్‌లో దిగ్గజాల్లాంటి కెప్టెన్లను రిటైర్ అవ్వమని అడగరు. నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తారు. అయితే వచ్చే వరల్డ్ కప్ నాటికి భారత్ ఆడే వన్డే మ్యాచ్‌లు 55 మాత్రమే ఉన్నాయి.

అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి కోహ్లీ తహతహ
మరోవైపు టెస్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్నీ బాధ్యతలు చేపట్టి పట్టు సాధించాలని ఆతృతగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ భవిష్యత్తు దృష్ట్యా ఓ నిర్ణయానికొచ్చిన సెలెక్షన్ కమిటీ.. ధోనీకి చెప్పకనే చెప్పినట్లు అతని నిర్ణయం కోసం ఎదురుచూసింది.

అక్కడ ఉండగానే కెప్టెన్సీపై ధోని నిర్ణయం
దీంతో ధోని కూడా తాను సాధించాల్సి ఏమీ లేదనట్లుగా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అక్కడ ఉండగానే ధోని తన కెప్టెన్సీపై నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ నిర్ణయానికి ముందు ధోని తన రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లతో 30 నిమిషాల పాటు సమావేశమయ్యాడు. తన క్రికెట్ ప్రస్థానంలోని ఎత్తు పల్లాలను జార్ఖండ్ ఆటగాళ్లతో పంచుకున్నాడు.

సహచరులతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్న ధోని
కెప్టెన్సీపై తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ధోని సహచరులతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. దీనిలో భాగంగా జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్‌కు ధోని కొన్ని మెళుకువులు నేర్పాడు. ఈ క్రమంలోనే నాలుగు రకాల బ్యాట్లను పరిశీలించి తన ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు.

హోటల్ సిబ్బందికి ధోని ఆటోగ్రాఫ్స్
రంజీ మ్యాచ్ అనంతరం హోటల్ సిబ్బందికి ధోని ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. బాల్ బాయ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగాడు. దీనికి ముందు నాలుగో రోజైన మంగళవారం వీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ కలిసి సుదీర్ఘంగా ముచ్చటించాడు. ఇక ధోని తన నిర్ణయం వెల్లడించాక అతనిపై తాము ఎటువంటి ఒత్తిడి చేయలేదని ఛీఫ్ సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడం విశేషం. ధోని ఏడాది కిందటో, ఆర్నెళ్ల కిందటో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే నేను బాధపడేవాడిని. అయితే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు అతనికి నా సెల్యూట్. విరాట్ ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని ధోనీ భావించాడు. అందుకే ధోనీ తీసుకున్నది సరైన నిర్ణయమే అని ప్రసాద్ అన్నాడు. దీనిని బట్టి సెలక్టర్లు విరాట్ వైపు మొగ్గుచూపుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications