
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ ట్విట్టర్ ఖాతా నుంచి వస్తున్న అర్థం పర్థం లేని ట్వీట్లు ఇదే విషయాన్ని తెలియచేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. నేడు రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి తనకు కాయిన్ టాస్‌లంటే ఇష్టమని, అవి తన కడుపులో ఎప్పుడు చేరుతాయోనని ఓ ట్వీట్ వచ్చింది. అలాగే మీకు తెలుసా? సందడి చేసే తేనేటీగలు గొప్ప బాక్సింగ్ బ్యాగ్‌లను కలిగి ఉంటాయని మరో ట్వీట్ వచ్చింది.
ఎప్పుడూ లేనిది రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి ఇలాంటి పోస్టులు రావడంతో అభిమానులతోపాటు నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. రోహిత్ శర్మకు ఏమైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హిట్‌మ్యాన్ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు వస్తుండడంతో అతని అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని అభిమానులతోపాటు నెటిజన్లు భావిస్తున్నారు. పలువురు రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట ఇవి వైరల్‌గా మారాయి. అయితే దీనిపై రోహిత్ శర్మ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ సన్నాహాకాల్లో భాగంగా బిజీగా ఉన్నాడు. దీనిపై వీలైనంత త్వరగా రోహిత్ శర్మ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
కాగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్‌లో 20.2 మిలియన్ల ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 22.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్ క్రికెట్‌కు సంబంధించిన విషయాలను పోస్ట్ చేసే హిట్‌మ్యాన్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటాడు. కాగా కొన్ని రోజుల క్రితం టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది. అతని ఖాతా నుంచి దుండగులు బిట్ కాయిన్‌కు సంబంధించిన పోస్టులు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కృనాల్ పాండ్యా సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించాడు.