ఆసియా కప్ 2025లో హ్యాండ్‌షేక్ కాంట్రవర్సీలు ఆగడం లేదు. భారత జట్టు పాకిస్తాన్‌తో కరచాలనం చేయకపోవడంపై వివాదం ఇంకా సద్దుమణగకముందే ఇప్పుడు బంగ్లాదేశ్ పేరుతో మరో కొత్త ప్రచారం మొదలైంది. పాకిస్తాన్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు బంగ్లాదేశ్ కెప్టెన్ టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో చేతులు కలపలేదని కొన్ని మీడియా వర్గాలు, పాకిస్తాన్ జర్నలిస్టులు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. నిజానికి సెప్టెంబర్ 14, 21 తేదీల్లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ భారత జట్టు ఉద్ధేశపూర్వకంగానే పాక్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి నిరాకరించింది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో కూడా ఇదే జరిగిందని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో నిజమెంత?
వైరల్ అవుతున్న 15 సెకన్ల వీడియోలో జేకర్ అలీ, సూర్యకుమార్ యాదవ్ మధ్య టాస్ సమయంలో హ్యాండ్ షేక్ జరగనట్లు కనిపిస్తోంది. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను పట్టించుకోలేదనే వార్తలు వేగంగా వ్యాపించాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదు. ఆ 15 సెకన్ల వీడియో మొత్తం కథను చెప్పడం లేదు. వీడియోలో చూపించని తర్వాత భాగంలో బంగ్లాదేశ్ కెప్టెన్ జేకర్ అలీ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను రవిశాస్త్రికి చెప్పిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ తో నవ్వుతూ స్నేహపూర్వకంగా చేతులు కలిపారు. ఆ తర్వాతే భారత కెప్టెన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా.. 41 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించిన అనంతరం.. భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఎప్పటిలాగే చేతులు కలుపుతూ కనిపించారు.

పుకారు వెనుక పాకిస్తానీ జర్నలిస్టులు
టీమిండియా ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, ఈ తప్పుడు వీడియో ఇంతలా వైరల్ కావడానికి ప్రధాన కారణం పాకిస్తానీ జర్నలిస్టులేనని తెలుస్తోంది. పాకిస్తాన్‌కు భారత్ చేతిలో ఎదురైన రెండు ఓటములు, చేతులు కలపకపోవడం ద్వారా జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకే వారికి ఇది సరియైన అవకాశంగా కనిపించింది.
ఫేక్ వీడియో ఇదే..
భారత్ ఎందుకు చేతులు కలపలేదు?
భారత జట్టు పాకిస్తాన్‌తో చేతులు కలపకపోవడానికి గల కారణం.. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు గౌరవం ఇవ్వడానికి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తమ సాయుధ బలగాలను గౌరవించడానికి తీసుకున్న నిర్ణయం. పాకిస్తాన్ ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆట నియమాలలో హ్యాండ్‌షేక్ చేసుకోవాలనే నియమం లేకపోవడంతో పాకిస్తాన్ మరింత ఇబ్బందికి గురైంది. ఫైనల్‌లో మరోసారి భారత్-పాకిస్తాన్ తలపడే అవకాశం ఉంది.