ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఓ కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. అతను కేవలం పరుగులు చేయడమే కాదు, మ్యాచ్‌ను చదవడంలోనూ, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు ధ్రువ్ జురేల్. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ధ్రువ్ జురేల్ కేవలం 42 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టును ఆదుకోవడమే కాకుండా తన మాస్టర్ మైండ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
అంబటి రాయుడు చెప్పిందే నిజమైంది..
ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన ధ్రువ్ జురేల్.. రెండో మ్యాచ్‌లోనే అద్భుత రీతిలో పుంజుకున్నాడు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జోడీ 38 బంతుల్లో 70 పరుగులు చేసి బలమైన పునాది వేసిన తర్వాత.. ధ్రువ్ జురేల్ క్రీజులోకి వచ్చి ఎంతో పరిణతితో ఆడాడు. అనవసరపు షాట్లకు పోకుండా మొదట యశస్వి జైస్వాల్‌కు స్ట్రైక్ ఇస్తూ పిచ్‌ను అర్థం చేసుకున్నాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక 5 ఫోర్లు, 5 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ధ్రువ్ జురేల్ షాట్ సెలక్షన్, టైమింగ్‌ను చూసి మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ 'పర్ఫెక్ట్ అసెస్‌మెంట్' అని కొనియాడగా.. అంబటి రాయుడు ధ్రువ్ జురేల్‌ను ఓ 'ఎక్సెప్షనల్ టాలెంట్' అని ప్రశంసించాడు.

బ్యాట్‌తో ఊచకోత.. మైండ్‌తో గుజరాత్‌కు చెక్!
అయితే ధ్రువ్ జురేల్ కేవలం బ్యాటింగ్‌తోనే సరిపెట్టుకోలేదు. స్టేడియంలో వ్యూహకర్తగానూ జట్టుకు వెన్నుదన్నుగా నిలిచాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించేందుకు గూగ్లీలను వాడమని సూచించడం వెనుక ధ్రువ్ జురేల్ ఆలోచన ఉంది. అది సత్ఫలితాలను ఇచ్చి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పంది. కానీ అసలైన గేమ్ ఛేంజర్ మూమెంట్ చివరి ఓవర్లలో చోటుచేసుకుంది. గుజరాత్ జట్టు విజయానికి దగ్గరవుతున్న సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ మార్పుల విషయంలో ధ్రువ్ జురేల్ ఇచ్చిన సలహా మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
నిజానికి 19వ ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండేకు, చివరి ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్‌కు ఇవ్వాలని కెప్టెన్ భావించాడు. కానీ ధ్రువ్ జురేల్ జోక్యం చేసుకుని.. 19వ ఓవర్ ఆర్చర్‌తో వేయిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుందని, చివరి ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండేతో వేయించడం మేలని సూచించాడు. ఈ చిన్నమార్పు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. జోఫ్రా ఆర్చర్ తన వేగంతో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయగా.. చివరి ఓవర్లో తుషార్ దేశ్‌పాండే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రషీద్ ఖాన్ వికెట్ తీసి జట్టుకు 6 పరుగుల విజయాన్ని అందించాడు.
రియాన్ పరాగ్‌కే సలహా ఇచ్చాడా?
మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్వయంగా మాట్లాడుతూ.. ఆ కీలక నిర్ణయం ధ్రువ్ జురేల్‌దేనని అంగీకరించాడు. టీ20 క్రికెట్‌లో కేవలం భారీ షాట్లు కొట్టడమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ధ్రువ్ జురేల్ నిరూపించాడు. తన బ్యాటింగ్, తెలివితేటలతో ధ్రువ్ జురేల్ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకే కాకుండా, ఐపీఎల్ మొత్తానికే ఒక పెద్ద స్టార్‌గా ఎదిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.