బెంగళూరు: బంగ్లాదేశ్‌తో రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాత్మక ఇన్నింగ్స్ పైన అభిమానులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. గత ఏడాది ధోనీ కెప్టెన్సీ పైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ధోనీ కెప్టెన్సీని వదులుకొని, కోహ్లీకి అప్పగించాలని చాలామంది చెప్పారు. నిన్న తిట్టిన వాళ్లే బంగ్లాదేశ్ మ్యాచ్ అనంతరం పొగుడుతున్నారు. ఐన్‌స్టీన్ పొరబడ్డాడని, కాంతి కన్నా ధోనీ వేగం ఎక్కువ అని, మహీ క్రికెట్లో చెస్ ఆడుతున్నాడని.. ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్నటి వరకు ధోనీ కెప్టెన్సీ పైన విమర్శలు చేసినవారు కూడా ఇప్పుడు పొగుడుతుండటంతో.. అతని అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ధోనీ ఎత్తుపల్లాలను, గెలుపోటములను ఒకేలా తీసుకుంటారు. అందుకే అతనిని కెప్టెన్ కూల్ అంటారు.

బంగ్లాదేశ్ మ్యాచ్‌తో ధోనీ కూడా విమర్శకులకు తన సత్తా ఏమిటో నిరూపించి, జవాబు చెప్పాడు. ధోని కెప్టెన్సీ, అతడి వ్యూహాలు, అతడి బౌలింగ్ మార్పులు, అతడి వేగం, సమయోచిత స్పందన.... చూసి అందరూ అశ్చర్యపోతున్నారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా, ముఖ్యంగా చివరి ఓవర్ పాండ్యా చేతికి బంతి ఇచ్చిన తర్వాత.. భారత్ సస్పెన్స్ మధ్య గెలిచింది. అయితే, గెలవడంతో అందరూ అతనిని ఆకాశానికెత్తుతున్నారు. ఓడిపోతే అదే ధోనీ వ్యుహాలను అందరూ తప్పుపట్టేవారు. తిట్టేవారనడంలో ఎలాంటి సందేహం లేదు.
తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులిచ్చేసిన బుమ్రాకు.. మూడో ఓవర్ వేయడానికి బంతి ఇచ్చినపుడు చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. పైగా అప్పటికే ఓ క్యాచ్ కూడా వదిలేసిన బుమ్రాపై అభిమానులు అసహనంతో ఉన్నారు.
అయితే ఆ స్థితిలో బూమ్రాను బౌలింగ్‌కు తీసుకొచ్చి తాను ఎవరి అంచనాలకూ అందనని చాటుకున్నాడు ధోని. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పాండ్య విషయంలోనూ ఇలాగే నమ్మకం ఉంచాడు. బూమ్రా క్యాచ్ వదిలేసినపుడు అందరూ అతణ్ని తిట్టుకున్నారు.
మరెవరైనా అయితే బూమ్రాను తిట్టేవారేమో. కానీ ధోనీ.. అందరినీ ప్రోత్సహిస్తాడని అంటారు. పొరపాటు చేసినా వారికి మరోసారి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ కారణంగానే బూమ్రా ఆ తర్వాత నిరూపించుకున్నాడు. అందరిలో ధోనీ కూడా.. విఫలమైన ఆటగాడిని అంటే ఆ కొత్త ఆటగాడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అతడి స్థైర్యం దెబ్బతింటుంది. కానీ ధోనీ ఎవరి స్థైర్యం దెబ్బతీసేలా చేయడని చెప్పవచ్చు.