జైపూర్: 'తండ్రి తండ్రే, కొడుకు కొడుకే' ధోనితో విరాట్ కోహ్లీని పోలుస్తూ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఇచ్చిన సమాధానం. జైపూర్‌లో వండర్ సిమెంట్ క్రికెట్ మహోత్సవ్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరైన కపిల్ దేవ్ మాట్లాడుతూ ధోని సాధించిన విజయాలతో పోలిస్తే కెప్టెన్‌గా కోహ్లీ చాలా మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా చక్కగా రాణిస్తున్నాడని కితాబిచ్చిన కపిల్ దేవ్, టీమిండియా వన్డే కెప్టెన్ ధోనితో ఏదో ఒకరోజు సమానమవుతాడని తన అభిప్రాయాన్ని తెలిపాడు. టీ20, వన్డే సిరిస్‌లలో పరాజయం పాలైన టీమిండియా కోహ్లీ కెప్టెన్సీలో టెస్టు సిరిస్‌కు సిద్ధమైంది.
గాంధీ-మండేలా ప్రీడం సిరిస్‌లో భాగంగా నవంబర్ 5 నుంచి భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కపిల్ పిచ్‌ల ప్రభావం టెస్టు సిరిస్‌పై పడుతుందన్నారు. టీమిండియా బలాన్ని దృష్టిలో పెట్టుకుని పిచ్‌లను తయారుచేస్తే విజయం మనదేనన్నారు.

టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండటంతో పాటు స్పిన్‌లో రాణిస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగా పిచ్‌లను తయారుచేయాలన్నారు. ముంబై పిచ్ క్యూరేటర్‌ని రవిశాస్త్రి బూతులు తిట్టడంపై ఆరోజు తాను అక్కడే ఉన్నానన్నారు.
2-2తో వన్డే సిరిస్‌లో సమానంగా ఉన్న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖెడ్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వడానికి పిచ్ కారణమంటూ మ్యాచ్ అనంతరం పిచ్ క్యూరేటర్‌ని టీమిండియా డైరెక్టర్ బూతులు తిట్టిన సంగతి తెలిసిందే.
ఇక సెహ్వాగ్ వీడ్కోలుపై స్పందిస్తూ ఆ విషయాన్ని సెలక్టర్లు చూసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ వీడ్కోలు గేమ్ ఇవ్వడం సాధ్యపడకపోవచ్చన్నారు. నన్నడిగే, అది పెద్దవిషయమేమి కాదన్నారు. ఎందుకంటే అతనో అద్భుతమైన ఆటగాడన్నారు. 99 టెస్టు మ్యాచ్‌లాడిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఆ ఒక్క గేమ్‌ను ఆడకుండానే వీడ్కోలు పలికాడని గుర్తు చేశారు.