
అభిమానులంటే చాలా ప్రేమ చూపించే క్రికెటర్లలో ఎంఎస్ ధోనీ అందరి కన్నా ముందుంటాడు. అభిమానులు తనపై చూపించే ప్రేమను పూర్తిగా అర్థం చేసుకునే సెలెబ్రిటీ అతను. అందుకే అప్పుడప్పుడూ వాళ్లకు కూడా గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఇటీవల రాంచీలో తనను చూసేందుకు వచ్చిన అభిమానితో అతను సెల్ఫీ దిగిన ఫొటో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరో అభిమానికి కూడా తన ప్రేమను చూపించాడీ స్టార్ క్రికెటర్.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన ధోనీ.. తను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాటును తమిళ యాక్టర్ యోగి బాబుకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది పట్టుకొని దిగిన ఫొటోను యోగి బాబు సోషల్ మీడియాలో పంచుకోగా అది తెగ వైరల్ అవుతోంది. డాక్టర్ వరుణ్, బీస్ట్ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన యోగి బాబు ఎక్కువగా కామెడీ పాత్రలు చేస్తుంటాడు. అతను ధోనీకి వీరాభిమాని కూడా. అందుకే అతనిపై ధోనీ కూడా ఇలా అభిమానం చాటుకున్నాడు.
ఈ విషయం తెలిసిన అభిమానులు ధోనీ పెద్ద మనసును తెగ మెచ్చుకుంటున్నారు. అతను ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాడని, తన అభిమానులంటే ధోనీకి చాలా ఇష్టమని అంటున్నారు. కాగా, ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ సీజన్‌తోనే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్నాయి. అసలు గతేడాదే క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని ధోనీ అనుకున్నాడని, కానీ చెన్నైలో తన చివరి మ్యాచ్ ఆడాలనే ఆలోచనతోనే ఆగాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ధోనీ.. వచ్చే ఐపీఎల్ కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చివరి సీజన్‌లో కూడా తన పూర్తి సామర్ధ్యంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాలని పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నాడు. మరి ఐపీఎల్‌లో చెన్నైకి మరో ట్రోఫీ అందిస్తాడేమో చూడాలి.