హరారే: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. 2007లో టీమిండియా జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టిన ధోని సుదీర్ఘ కాలంగా కెప్టెన్సీ బాధ్యతలను మోస్తూనే ఉన్నాడు. గతేడాది టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలను విరాట్ కోహ్లీకి అప్పగించిన ధోని వన్డే, టీ20 జట్లకు మాత్రం తానే కెప్టెన్‌గా వ్వవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం జింబాబ్వే పర్యనటలో భాగంగా ఆతిథ్య జట్టులో జరిగిన మూడో టీ20లో ఆఖరి ఓవర్‌లో విజయం సాధించి టీ20 సిరిస్‌ను ధోని సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో ధోని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌కు 324 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ధోని, అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ రికార్డుని సమం చేశాడు. ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని 60 టెస్టులు, 194 వన్డేలు, 70 టీ20 మ్యాచ్‌లకు ప్రాతనిధ్యం వహించాడు.

34 ఏళ్ల ధోని టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. తన 9 ఏళ్ల కెప్టెన్సీలో భారత్‌కు వరల్డ్ టీ20 (2007), వరల్డ్ కప్ (2011)తో పాటు ఛాంపియన్స్ ట్రోపీ (2013)ను దేశానికి అందించాడు.
దీంతో పాటు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేశాడు. జింబాబ్వే పర్యనటలో సిరిస్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో ఒక ఏడాదిలో అత్యధిక టీ20లు (15) గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది. దీంతో పాటు అత్యధిక టీ20లు (19) ఆడిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. ఈ 19 మ్యాచ్‌ల్లో జట్టులో ఉండటం ద్వారా ధోని, బుమ్రా ఓ ఏడాదిలో అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్లుగా అవతరించారు.