న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌కు యువరాజ్ సింగ్ ఎంపిక కాకపోవడం వెనుక కెప్టెన్ ధోని ప్రమేయం ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ధోని ఒత్తిడి కారణంగానే జాతీయ సెలక్టర్లు యువరాజ్‌ని ఎంపిక చేయలేదని అన్నారు. ధోనికి తన కుమారుడితో విబేధాలుంటే అందుకు తానేమీ చేయలేనని, ఆ దేవుడే చూసుకుంటాడని ఆయన వ్యాఖ్యానించారు.

యువీ పట్ల ఇంత దారణంగా ప్రవర్తించడం కంటే విచారించదగ్గ అంశం మరోకటి ఉండదని ధోనిని ఉద్దేశించి అన్నాడు. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ జాబితాలో యువరాజ్ సింగ్ చోటు దక్కించుకున్న తర్వాత రంజీల్లో వరుస సెంచరీలు సాధించాడు. దీంతో యువరాజ్ సింగ్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించినా, సెలక్టర్లు మొండి చేయి చూపించారు.
తండ్రి వ్యాఖ్యలకు స్పందించిన యువరాజ్, అందరిలాగే తన తండ్రి కూడా ఆవేదనకు గురయ్యాడని.... కానీ, ధోనీ నాయకత్వంలో ఆటను ఎంతో ఆస్వాదించానని, భవిష్యత్తులో ఆస్వాదిస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
11వ ఎడిషన్ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆస్టేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొన్నాయి.
గ్యారీ క్రిస్టెన్‌తో మళ్లీ పనిచేయబోతుండటం సంతోషంగా ఉంది: యువరాజ్ సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్ గ్యారీ క్రిస్టెన్‌తో పనిచేయబోతుండటం సంతోషంగా ఉందని యువరాజ్ సింగ్ అన్నారు. ఐపీఎల్ 8 వేలంలో యువీని రూ. 16 కోట్లు పెట్టి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో యువీ మాట్లాడుతూ ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో నేను నిద్రపోతున్నాను.
కొంతమంది ఇంటికి వచ్చి నన్ను అభినందించడంతో ఈ విషయం తెలిసిందన్నారు. మళ్లీ క్రిస్టెన్ ఆధ్వర్యంలో ఆడబోతున్నాను. ఆయన శిక్షణలో మంచి విజయాలు సాధించాను. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లోనూ అవి పునరావృతమవుతాయని ఆశిస్తున్నానని చెప్పారు.