
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని వయసు 36 అయినా 26 ఏళ్ల వారిని ఓడించగల సత్తా ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో ధోని ఫామ్‌పై గతంలో విమర్శలు చేసిన వారిపై రవిశాస్త్రి నిప్పులు చెరిగారు.
'మనం మూర్ఖులం కాదు. గత 30-40 ఏళ్ల నుంచి ఈ ఆటను చూస్తున్నా. విరాట్ కోహ్లీ గత దశాబ్ద కాలం నుంచి జట్టులో ఉన్నాడు. ఈ వయసులోనూ ధోని 26 ఏళ్ల వారితో పోటీపడుతున్న సంగతి మనకు తెలుసు. అతనిపై విమర్శలు చేస్తున్న వారు క్రికెట్ ఆడిన సంగతి మరిచిపోయారు' అని రవిశాస్త్రి అన్నాడు.
'అలాంటి వారు అద్దం ముందు నిల్చొని 36 ఏళ్ల వయసులో ఏం చేశారో ప్రశ్నించుకోవాలి. వారు వేగంగా రెండు పరుగులు తీశారా? వారు రెండు తీస్తే ధోనీ మూడు తీయగలడు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని యావరేజి 51. వన్డేల్లో అతని స్థానాన్ని భర్తీచేసే వికెట్ కీపర్ ఇప్పటిదాకా కనిపించనేలేదు' అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
2019 వరల్డ్ కప్ వరకు ధోని జట్టులో ఉంటాడని ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో రవిశాస్త్రి ఏకీభవించారు. టెస్టు క్రికెట్ ఆడనంత మాత్రాన 2019 వరల్డ్ కప్ ఆడనట్టు కాదని ఈ తెలిపాడు. జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్ గురించి కూడా శాస్త్రి మాట్లాడాడు.
'ప్రత్యర్ధి జట్టు ఏదైనా సరే టీమిండియాకు ఒక్కటే. ఈ పర్యటన టీమిండియాకు మంచి అవకాశం. ఇప్పటి వరకు భారత్ అక్కడ సిరీస్ గెలవలేదు. కోహ్లీసేనకు ఇది అద్భుత అవకాశం' అని రవిశాస్త్రి తెలపాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.
క్రికెట్ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన ఆటగాడని, దీంతో పాటు కోహ్లీ తన ప్రమాణాలు పెంచుకుని ఇతరులు అనుసరించేలా ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. ఈ ఏడాది టీమిండియా అద్భుత విజయాలను సొంతం చేసుకోవడానికి గల కారణం డ్రస్సింగ్ రూమ్‌లో నెలకొన్న వాతవరణమేనని అన్నాడు. జట్టులో 'నేను' అన్న పదమే లేదని 'మేము' అని మాత్రమే ఉందని రవిశాస్త్రి చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.