న్యూఢిల్లీ: విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు దేశంలోని 46 సెంట్రల్ యూనివర్శిటీల్లో జాతీయ జెండాను నిర్ణీత ఎత్తు(207ఫీట్లు)లో తప్పకుండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ మద్దతు పలికాడు. అది దేశానికిచ్చే గౌరవమని శిఖర్ ఈ సందర్భంగా తెలిపాడు.
' నా దృష్టిలో యూనివర్శిటీల్లో జాతీయ జెండాను ఎగరవేయడమనేది మంచి కార్యక్రమం. జాతీయ జెండా అంటే దేశ గౌరవమే. అది చాలా సున్నితత్వంతో కూడుకున్నది. యూనివర్శిటీల్లో జాతీయ జెండా ఎగురవేస్తే ఎప్పడూ దేశం గురించి అగౌరవంగా మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఎవరూ కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు' అని శిఖర్ తెలిపాడు.
'గత రాత్రి ప్రొ-కబడ్డీ లీగ్ జరిగే ముందు జాతీయ గీతం ఆలాపిస్తున్నారు. ఆ సమయంలో మ్యాచ్‌ను చూస్తున్న నేను కూడా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించా. దేశం తరపున ఆడే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టం' అని శిఖర్ పేర్కొన్నాడు.

దేశ పౌరులుగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే మనం చేసే పనులు కూడా సక్రమంగా ఉండాలని శిఖర్ అభిప్రాయపడ్డాడు. సెంట్రల్ వర్సిటీల్లో ప్రతిరోజూ 207 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగరేయాలని వీసీల సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో సూరజ్‌కుండ్‌లో జరిగిన సెంట్రల్ వర్సిటీల వీసీల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. తొలి పతాకాన్ని జేఎన్‌యూలో ఎగురవేయనున్నారు. ఇప్పటికే వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురుతున్నా.. అన్ని చోట్లా జాతీయ జెండా ఎత్తు సమానంగా ఉండాలని తీర్మానంలో నిర్ణయించారు.
ధోనీపై విమర్శలు సరికాదు
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు చేయడం సరికాదని జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి అన్నాడు. జట్టు నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైదంటూ ఇటీవల వినిపించిన విమర్శల నేపథ్యంలో శాస్త్రి పైవిధంగా స్పందించాడు. త్వరలో ఆసియా కప్, వరల్డ్ ట్వంటీ 20లు జరుగనున్న నేపథ్యంలో ధోనిపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని శాస్త్రి హితవు పలికాడు.
గత కొన్నేళ్లుగా జట్టుకు మరపురాని విజయాలను అందించిన ధోనికి రిటైర్మెంట్ విషయంలో ఎవరి సలహాలు అవసరం లేదన్నాడు. ఒక ఛాంపియన్ ఆటగాడికి తన రిటైర్మెంట్ పై నిర్ణయాన్ని అతనికే వదిలేయాలన్నాడు. గతంలో టెస్టు ఫార్మాట్ నుంచి ధోని ఆకస్మికంగా బయటకొచ్చిన సంగతిని రవిశాస్త్రి ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
ఆ సమయంలో ధోని టెస్టుల నుంచి వీడ్కోలు చెబుతున్నట్లు ఎవ్వరికీ తెలియదన్నాడు. 'ధోని విషయంలో నేను కచ్చితంగా ఒకటి చెప్పగలను. అతను ఇంకా ఆడగలను అనుకుంటే జట్టులో ఉంటాడు. ఒకవేళ నా సమయం ముగిసింది అనుకుంటే అతనే బయటకు వస్తాడు. ధోని బాధ్యత ఏమిటో దానిని అతను సక్రమంగా నిర్వర్తించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు' శాస్త్రి చెప్పాడు.
'గతంలోలా అతని బ్యాట్ నుంచి సిక్సర్లు, ఫోర్లు రాకపోవచ్చు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ధోని చాలా సందర్భాల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. అక్కడ బ్యాటింగ్ చేయడం ఒత్తిడితో కూడుకున్నది. అయినా ఆ స్థానంలో మనం మెరుగ్గానే ఉన్నాం. చాలా కాలం నుంచి ఆ స్థానంలో ఇబ్బందులు లేకపోవపోవడంతోనే ఛాంపియన్ స్థాయిలో ఆడగల్గుతున్నాం' అని రవిశాస్త్రి తెలిపాడు.