
న్యూజిలాండ్ స్టార్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ డెవాన్ కాన్వే తన వివాహ వేడుక కోసం తాత్కాలికంగా ఐపీఎల్ బయోబబుల్‌ను విడి తన స్వదేశమైన దక్షిణాఫ్రికాకు వెళ్లిన సంగతి తెలిసింది. ఈ లెఫ్టార్మ్ బ్యాటర్.. తన ప్రేయసి కిమ్ వాట్సన్‌ను పెళ్లాడాడు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వారికి క్రికెట్ ప్రముఖులు, సహచర క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
డెవాన్ కాన్వే వివాహ వేడుక సందర్భంగా సూట్, టై ధరించగా.. అతని వైఫ్ కిమ్ వాట్సన్ సాంప్రదాయ వివాహ గౌనును ధరించింది. వీరిద్దరూ మూడేళ్లపాటు డేటింగ్ చేశారు. అనంతరం పెళ్లితో ఒక్కటయ్యారు. డెవాన్ కాన్వే బయోబబుల్‌ను వీడేముందు సీఎస్కే ఫ్రాంచైజీ సైతం అతని కోసం సంప్రదాయ ప్రీ-వెడ్డింగ్ వేడుకను ఏర్పాటు చేసింది.
తాజాగా సీఎస్కే తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో 'లయన్, లేడీ ఒక్కటయ్యారు. హ్యాపీ వెడ్డింగ్.. విజిల్స్ టు కిమ్ & కాన్వే!' అంటూ పోస్టు చేసింది. కాన్వే దక్షిణాఫ్రికాలో జన్మించినప్పటికీ న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అక్కడ రాణిస్తున్న ఈ క్రికెటర్‌ను సీఎస్కే గమనించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రెండు రోజుల మెగా వేలంలో అతన్ని బేస్ ప్రైస్ రూ.కోటికి కొనుక్కుంది. తొలిసారిగా డెవాన్ కాన్వే.. ఐపీఎల్లో ఆడుతున్నాడు. సీఎస్కే తరఫున అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. వచ్చిన ఒక మ్యాచ్‌లో కేవలం 3పరుగులు మాత్రమే చేశాడు. ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
సీఎస్కే ప్లేయింగ్ XIలో తనకు చోటు దక్కితే.. తన అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించాలని కాన్వే ఉబలాటపడుతున్నాడు. గత మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ.. ఆఖరి ఓవర్లో చెలరేగడంతో చివరి మ్యాచ్‌లో సీఎస్కే 3వికెట్ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో విజయం.
నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో సీఎస్కే తలపడనుంది. మూడో విజయం కోసం చెన్నై సన్నద్ధమవుతోంది. ఏప్రిల్ 24న మళ్లీ ఐపీఎల్ ఆడడానికి తిరిగొచ్చిన డెవాన్ కాన్వే PBKSతో మ్యాచ్‌తో మాత్రం అందుబాటులో ఉండడు. మూడు రోజుల పాటు అతను ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే సీఎస్కే క్యాంపులో చేరడానికి ముందు అవసరమైన అన్ని కొవిడ్ ప్రోటోకాల్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎట్టకేలకు తన పెళ్లి ముచ్చట తీర్చుకున్న కాన్వే.. తుది జట్టులో చోటు దొరికితే ఎలా ఆడతాడో చూడాలి మరీ.