హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తాడని ఐసీసీ మాజీ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మద్రాస్ అడ్వర్టైసింగ్ క్లబ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గంటన్నర సేపు మాట్లాడిన ఆయన తన ప్రసంగంలో ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ పేరే ప్రస్తావించారు. చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే ఏడాది గొప్పగా పునరాగమనం చేస్తుందని, రెండేళ్లుగా పోటీపడకున్నా సీఎస్‌కే బ్రాండ్ విలువపై ప్రభావం లేదని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డాడు.

'ధోనీ నాయకత్వంలో అప్పటికే భారత్ జట్టు ప్రపంచకప్ 2007లో విజేతగా నిలిచింది. దీంతో ఐపీఎల్ తొలి సీజన్ (2008) వేలానికి ముందే మా గ్రూప్ సభ్యులకి ధోనీని ఎంత ధరైనా సరే కొనుగోలు చేయమని చెప్పాను. అతను అందరికంటే భిన్నమైన వ్యక్తి. అతడి నాయకత్వంలో చెన్నై జట్టు తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తుందని మేము నమ్మాం. ఫిక్సింగ్, సస్పెన్షన్ లాంటి బాధాకరమైన అంశాలు చోటుచేసుకున్నా నేటికీ చెన్నై జట్టుకు అభిమానుల మద్దతు మెండుగా ఉంది' అని అన్నాడు.
'2018లో ధోనీ మళ్లీ చెన్నై జెర్సీ ధరించి జట్టును నడిపిస్తాడు. మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెడతాం. 2007లో టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. ఆ తర్వాత 2008లో ఓ సరికొత్త ఐడియాతో ఐపీఎల్ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం బిడ్డింగ్ వేశాం. అప్పడు జట్టు లోగో, బ్రాండ్ అంబాసిడర్, వేలం, జట్టు కాంబినేషన్ అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది' అని శ్రీనివాసన్ ధీమా వ్యక్తం చేశాడు.
'ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు రెండు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. చెన్నై జట్టు సక్సెస్‌లో ధోని కీలకపాత్ర పోషించాడు. అతడి కెప్టెన్సీనే చెన్నై జట్టుకు ఎక్కువ మంది అభిమానులను సాధించేలా చేసింది. అలాంటి ధోని నేతృత్వంలో 2018లో చెన్నై జట్టు గొప్పగా పునరాగమనం చేస్తుంది' అని శ్రీనివాసన్ తెలిపాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడడంతో సుప్రీంకోర్టు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్ల ఆటగాళ్లను కొత్తగా వచ్చిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.