ప్రపంచ కప్‌ను సాధించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ కప్ గెలిచిన క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ కప్ సాధించిన క్రీడాకారిణులను ప్రత్యేకంగా అభినందించారు. విజేత జట్టులోని ఒక్కో క్రికెటర్‌కు రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందించారు. శిక్షకులకు కూడా రూ. 2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు.
దేశానికే గర్వకారణం: పవన్ కల్యాణ్
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కల్యాణ్ కొనియాడారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, వారికి అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.

క్రీడాకారిణుల విజ్ఞప్తులపై తక్షణ చర్యలు
ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు అయిన దీపిక (జట్టు కెప్టెన్), పాంగి కరుణా కుమారి ఉండటం పట్ల ఉప ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక (శ్రీ సత్యసాయి జిల్లా, హేమావత్ పంచాయతీ, తంబలహట్టి తండాకు చెందినవారు) తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ భేటీ అంధ క్రీడాకారుల పట్ల ప్రభుత్వ ప్రోత్సాహం, వారి సమస్యల పరిష్కారంపై డిప్యూటీ సీఎం నిబద్ధతను తెలియజేసింది.