
హైదరాబాద్: డెన్నిస్ ఫ్రీడ్‌మన్... భారత అభిమానులు మరిచిపోలేని పేరు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ జర్నలిస్ట్ గతంలో భారత క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ట్వీట్లు చేశాడు. తాజాగా, డెన్నిస్ ఫ్రీడ్‌మన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఎవరిని లక్ష్యం చేసుకున్నాడో తెలుసా! క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని.
తాజాగా అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా... రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవాను కలిశాడు. ఈ ఫొటోను డెన్నిస్ తన ట్విటర్ ఖాతాలో ఉంచి 'సచిన్ టెండూల్కర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది' అని మరియా షరపోవా చెప్పినట్లు డెన్నిస్ తన ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు.
గతంలో అనేక సార్లు సచిన్ టెండూల్కర్‌పై వ్యంగ్యంగా పోస్టులు పెట్టిన డెన్నిస్ ఫ్రీడ్‌మన్ ఈ సారి సచిన్ టెండూల్కర్ ఎత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ట్వీట్ చేశాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 'క్రికెట్ దేవుడు, దిగ్గజ క్రికెటర్ సచిన్‌కు ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకో. అతనిపై జోకులేసే హక్కు నీకు లేదు' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరో నెటిజన్ 'ఎత్తు సమస్య కాదు. నువ్వు సాధించిన విజయాలే నీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. హద్దు దాటకు' అంటూ ఫ్రీడ్‌మన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. 'సచిన్ సంపాదించుకున్న పేరులో మరియా ఒక్క శాతం కూడా సాధించలేదు. గుర్తింపు కోసమే నువ్వు ఇలా చేస్తున్నావు. సిగ్గుచేటు' అంటూ మండిపడ్డారు.