విశాఖపట్నం: రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నోట్ల రద్దు చర్య తనను విశేషంగా ఆకట్టుకుందని కోహ్లీ పేర్కొన్నాడు.
భారత దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఓ అద్భుతమైన ఘట్టమని కోహ్లీ పేర్కొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు ఆడేందుకు భారత జట్టు విశాఖపట్నానికి చేరుకుంది. ఈ సందర్భంగా కోహ్లి బుధవారం మీడియాతో మాట్లాడాడు.
'నా వరకు ఇది గొప్ప నిర్ణయం. దేశ రాజకీయ చరిత్రలో ఇంత గొప్ప నిర్ణయం ఇప్పటివరకు చూడలేదు. పెద్ద నోట్లను రద్దు చేయడం నన్నెంతోగానే ఆకట్టుకుంది. ఇదంతా నమ్మలేకుండా ఉన్నాం' అని కోహ్లీ తెలిపాడు. అంతేకాదు రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న సరదా సన్నివేశాన్ని మీడియాతో పంచుకున్నాడు.

రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత హోటల్ బిల్లు కట్టేందుకు వెళ్లానని, అయితే తన దగ్గర ఆ సమయంలో పాత 500 నోట్లు ఉన్నాయని, అవి చెల్లవని గ్రహించిన తర్వాత ఆ నోట్లను తన దగ్గరే ఉంచుకున్నట్లు చెప్పాడు. తన అభిమానులకు సంతకం చేసి ఇచ్చేందుకు ఆ నోట్లను వాడనున్నట్లు కోహ్లీ చెప్పాడు.
మార్చి 31 తర్వాత కూడా ఆ ఐదు బ్యాంకులు రూ.500, 1000 నోట్లు స్వీకరిస్తాయని అవి బ్యాంక్స్ ఆఫ్ గంగా, యమునా, సరస్వతీ, నర్మదా, గోదావరి అని సెహ్వాగ్ తనదైన శైలిలో ఛలోక్తి విసురుతూ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు బుధవారం విశాఖపట్నంలోని ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో తీవ్రంగా కసరత్తులు చేశారు. పెద్ద నోట్ల రద్దుపై ఇటీవలే టీమిండియా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ కూడా తనదైన శైలిలో స్పందించారు.