అఫీసియల్: అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మారనున్న ఫిరోజ్ షా కోట్లా

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మారబోతుందా? అంటే అవుననే అంటున్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చాలని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం డీడీసీఏ తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించింది.
కాగా, సెప్టెంబర్ 12న జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు సైతం హాజరుకానున్నారు. కాగా, డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు.
ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి
ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎక్కువ మంది అభిమానులు మ్యాచ్‌ని వీక్షించేందుకు వీలుగా కోట్లా స్టేడియం కెపాసిటీని సైతం అరుణ్ జైట్లీ పెంచారు. దీంతో పాటు ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో కీలకంగా వ్యవహారించారు.

వరల్డ్ క్లాస్ డ్రెస్సింగ్ రూమ్స్‌ను నిర్మించడంలో
ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో వరల్డ్ క్లాస్ డ్రెస్సింగ్ రూమ్స్‌ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది యువ క్రికెటర్లను ప్రొత్సహించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆగస్టు 9వ తేదీన జైట్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు జైట్లీ పేరు
అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం మధ్యాహ్నాం 12.07 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే ఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దివంగత నేత అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. "మన అభిమాన నాయకుడి జ్ఞాపకార్థం యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని ‘అరుణ్ జైట్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్'గా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను" అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు ఓ లేఖ రాశారు.

విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం
విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘానికి ఆయన నాయకుడిగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలు శిక్షను కూడా అనుభవించారు. 1977లో జైట్లీ ఏబీవీపీ ఢిల్లీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1980లో ఆయన బీజేపీలోకి అడుగుపెట్టారు. తర్వాత అదే ఏడాది ఆయన బీజేపీ ఢిల్లీ యూనిట్ యూత్ వింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి
2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి అమృత్ సర్ నుంచి పోటీ చేసిన అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మోడీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications