
ఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్న గబ్బర్.. గురువారం వాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా మహమ్మారి సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు తెలియజేశాడు. వీలైనంత త్వరగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకొని.. వైరస్‌ను ఓడించాలని ధావన్ సూచించాడు.
శిఖర్ ధావన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'కరోనా వాక్సినేషన్ పూర్తైంది. త్యాగాలు చేస్తూ, అంకితభావంతో ముందు వరుసలో పోరాడుతున్న యోధులకు కేవలం ధన్యవాదాలు మాత్రమే చాలవు. ఏ మాత్రం వెనుకాడకుండా సాధ్యమైనంత త్వరగా మీరు కూడా కరోనా టీకా వేయించుకోండి. వైరస్‌ను ఓడించేందుకు అది సాయపడుతుంది' అని గబ్బర్ ట్వీట్ చేశాడు.
పలు జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 29 మ్యాచ్‌లను మాత్రమే నిర్వహించారు. ఇక 14వ సీజన్లో శిఖర్ ధావన్ అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుత విజయాలు అందించాడు. లీగ్ ఆరంభం నుంచీ గబ్బర్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. మొత్తం 8 మ్యాచులు ఆడిన ఢిల్లీ 6 విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో గబ్బరే కీలకంగా నిలిచాడు. 54.28 సగటు, 134.27 స్ట్రైక్‌రేట్‌తో 380 పరుగులు చేశాడు. 3 అర్ధ శతకాలు, 43 బౌండరీలు, 8 సిక్సర్లు కొట్టాడు.
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ తన వంతుగా రూ.20 లక్షల్ని ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం విరాళంగా ఇచ్చాడు. అలానే ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్రైజ్‌మనీ రూపంలో వచ్చే మొత్తాన్ని కూడా విరాళంగా ఇస్తున్నట్లు గబ్బర్ ప్రకటించాడు. సామాజిక సేవ చేయడంలో ధావన్ ఎప్పుడూ ముందుంటాడన్న విషయం తెలిసిందే. మూగజీవాలు అన్న కూడా మనోడికి ఎనలేని ప్రేమ. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్నాడు గబ్బర్.