
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మరోసారి కరోనా భూతం పట్టుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లు మరోసారి ఐసోలేషన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఒక నెట్ బౌలర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక గత నెలలో ఢిల్లీ జట్టులోని ఆరుగురు సభ్యులకు కరోనా పాజిటివ్ రాగా వారందరూ ఐసోలేషన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, సీఫెర్ట్ కూడా ఉన్నారు.
తాజాగా ఢిల్లీ శిబిరంలో కోవిడ్ పాజిటివ్ కేసు వెలుగుచూడడంతో ఢిల్లీ ప్లేయర్లు, జట్టు సహాయక సిబ్బంది ఐసోలేషన్లోకి మరోసారి వెళ్లారు. 'ఈరోజు ఉదయం నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌లో ఒక నెట్ బౌలర్‌కు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ప్లేయర్లను వారి వారి రూమ్‌లలోనే ఉండాలని చెప్పాం' అంటూ ఐపీఎల్ నిర్వాహకులు చెన్నైతో కొన్ని గంటల్లో మ్యాచ్ ఉందనగా పీటీఐ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు. దీంతో ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా అన్న డైలామా పీక్స్ కు చేరుకుంది. ప్రముఖ క్రికెట్ న్యూస్ ప్లాట్ ఫాం క్రిక్‌బజ్ ప్రకారం.. ఢిల్లీ జట్టు మొత్తం ఐసోలేషన్‌కు వెళ్లింది. ఫ్రాంచైజీ సభ్యులు వారి గదులకే పరిమితమయ్యారు. ఆదివారం ఉదయం తాజా రౌండ్ పరీక్షలు నిర్వహించగా కోవిడ్ కేసు ఢిల్లీ క్యాంపులో వెలుగుచూసింది.
ఇక విదేశీ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్‌తో పాటు మరో నలుగురు సహాయక సిబ్బంది ఇటీవల పాజిటివ్ బారిన పడి మళ్లీ కోలుకుని జట్టులో చేరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో అన్ని రకాల కోవిడ్ పరీక్షలు జరిపి వారిని బయోబబుల్లోకి తీసుకొచ్చారు. అయినా నెట్ బౌలర్ కరోనా బారిన పడడం విస్మయాన్ని రేకెత్తిస్తోంది. ఇక ఢిల్లీ జట్టు ఆడిన పది మ్యాచ్‌లలో ఐదు విజయాలతో 10పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతుంది. నేడు చెన్నైతో జరగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఢిల్లీ భావిస్తున్న తరుణంలో కరోనా ఢిల్లీ జట్టును దెబ్బకొట్టింది. ఇటీవల కరోనా కొట్టిన దెబ్బ వల్ల లయ దెబ్బతిన్న ఢిల్లీ జట్టు మళ్లీ పుంజుకోగా మరోసారి కరోనా కలకలం రేగి ఆ జట్టు ఆటపై ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది.