ఐసీసీ ఛాంపియన్స్ 2025 ట్రోఫీ ఘనంగా ముగిసింది. మరో 12 రోజుల్లో మెగా లీగ్ ఐపీఎల్ 2025 అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓ స్టార్ ప్లేయర్ జట్టుకు దూరం కానున్నాడు.
అందుకే దూరం..
ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. తదుపరి సిరీస్‌ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రూక్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఆ మధ్య జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.6.25 కోట్ల భారీ ధరకు బ్రూక్‌ను దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పైగా బ్రూక్.. డబ్బులు పెట్టిన కొనుగోలు చేశాక ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో సారి. గత సీజన్ లోనూ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.

బ్రూక్‌పై బ్యాన్..!
బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్, ఆ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకోకూడదు. ముఖ్యంగా సరైన కారణంగా లేకుండా తప్పుకుంటే అతడిపై రెండేళ్ల నిషేధం పడుతుంది. కాబట్టి హ్యారీ బ్రూక్‌పై బ్యాన్ పడే అవకాశం ఉంది.
కెప్టెన్ అయ్యే ఛాన్స్..
ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమి నేపథ్యంలో ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. అతడి స్థానంలో బ్రూక్ కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. అందుకే అతడు జట్టు కోసం ఇప్పుడు ఐపీఎల్ ను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.