
ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ కోవిడ్-19నుండి కోలుకున్నారు. పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులో చేరారు. గత వారం వీరిద్దరికి కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో వీరు ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. అలాగే వీరితో పాటు ఢిల్లీ క్యాంపులో మరో నలుగురు సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా రెండు రౌండ్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. మార్ష్, సీఫెర్ట్‌లకు నెగెటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరు తమ ఐసోలేషన్ పూర్తి చేసుకుని జట్టులో చేరారు. మళ్లీ జట్టు బయోబబుల్‌లోకి వచ్చారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. ఈక్రమంలో మార్స్, సీఫెర్ట్ ప్రాక్టీస్ చేస్తూ కన్పించారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ మేరకు ఓ పోస్టు చేసింది. మార్స్, సీఫెర్ట్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులో చేరారని అప్‌డేట్ ఇచ్చింది. 'కొవిడ్ నుంచి కోలుకుని తిరిగి మీరు ప్రాక్టీస్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది గాయ్స్ అంటూ' డీసీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ మేరకు వారు ప్రాక్టీసు చేస్తున్నప్పుడు తీసిన ఫోటోను పోస్టు చేసింది. అయితే వీరిరువురు తిరిగి రేపు జరగబోయే మ్యాచ్‌లో తుది జట్టులో ఉంటారో లేదో మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
ఢిల్లీ క్యాంపులో కరోనా కలకలంతో బీసీసీఐ తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ జట్టు ఆడాల్సిన రెండు మ్యాచ్‌లను పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం నుంచి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, వాంఖడే స్టేడియాలకు మార్చింది. అప్పటి నుంచి ఢిల్లీ క్యాంపులో గానీ, ఇతర జట్ల క్యాంపుల్లో గానీ ఎలాంటి కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూడలేదు. కానీ ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యులలో ఒకరికి పాజిటివ్ రావడంతో ఐదు రోజుల పాటు పాంటింగ్ ఐసోలేషన్లోకి వెళ్లాడు. ఇప్పుడు అతను కూడా జట్టులోకి వచ్చాడు.
కరోనా వల్ల ఢిల్లీ క్యాపిటల్స్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తిరిగి జట్టులో చేరడంతో జట్టు బలోపేతం కావడం ఖాయం. ప్రస్తుతం 7మ్యాచ్‌ల్లో ఢిల్లీ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి 6పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. కేకేఆర్ కూడా తమ చివరి నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయి, ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.