టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చుట్టూ అల్లుకున్న వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. గతేడాది చివరలో సూర్యకుమార్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడల్ ఖుషీ ముఖర్జీ ఇప్పుడు భారీ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా నమోదైంది.
అసలేం జరిగిందంటే?
2025 చివరిలో మోడల్ ఖుషీ ముఖర్జీ ఓ సంచలన ఆరోపణ చేశారు. స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తనకు గతంలో మెసేజ్‌లు చేసేవారని ఆమె పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో సూర్య ఇమేజ్‌కు భంగం కలిగించే ప్రయత్నం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సూర్యకుమార్ యాదవ్ నేరుగా స్పందించనప్పటికీ అతని అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.100 కోట్ల పరువు నష్టం దావా
సూర్యకుమార్ యాదవ్ అభిమాని, ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌కు చెందిన ఫైజాన్ అన్సారి.. ఖుషీ ముఖర్జీపై కోర్టును ఆశ్రయించారు. ఆమె చేసిన ఆరోపణలు అబద్ధమని, కేవలం పబ్లిసిటీ కోసమే స్టార్ ప్లేయర్ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమెపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. అంతేకాకుండా గాజీపూర్ ఎస్పీ డాక్టర్ ఇరాజ్ రాజాను కలిసి సదరు మోడల్‌ను వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
మోడల్ ఖుషీ ముఖర్జీ వెనక్కి తగ్గుతున్నారా?
తాజా సమాచారం ప్రకారం, ఈ లీగల్ నోటీసులు, కేసు తీవ్రతను చూసి ఖుషీ ముఖర్జీ ఒకింత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడు క్షమాపణలు చెప్పి ఈ వివాదాన్ని ముగించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సూర్య అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.
వరల్డ్ కప్ సన్నాహాల్లో సూర్య
ఓ వైపు బయట ఇన్ని వివాదాలు నడుస్తున్నా, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన దృష్టిని ఆటపైనే కేంద్రీకరించారు. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సూర్య సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో సూర్య ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారీ స్కోర్లు సాధించి, తన మునుపటి ఫామ్‌ను చాటుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.