జై హనుమాన్.. అంతా ఆయన దయ వల్లే: టీమిండియా స్టార్ స్పిన్నర్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ అత్యంత కీలక పాత్ర పోషించింది. తన అద్భుతమైన మాయాజాలంతో కేవలం 10 పరుగులకే 5 వికెట్లు పడొగట్టి పాక్ నడ్డి విరిచిన దీప్తి శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న అనంతరం దీప్తి మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకుంది. ఈ విజయం పట్ల తాను ఎంతో కృతజ్ఞతతో ఉన్నానని, ఇలాంటి స్పిన్‌కు అనుకూలించే వికెట్లపై బౌలింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని పేర్కొంది. ఈ ఘనత సాధించిన క్రమంలో ఆమె భక్తిపూర్వకంగా "హనుమాన్ జీ గొప్పవాడు" అంటూ హనుమంతుడిని స్మరించుకోవడం విశేషం.
అసలు వ్యూహాన్ని వివరించిన దీప్తి శర్మ
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పై పాకిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేసిన వ్యూహాన్ని దీప్తి శర్మ వివరించింది. "పిచ్‌పై బంతి బాగా టర్న్ అవుతోంది. అందుకే నేను ప్రతి బంతికి, ప్రతి ఓవర్‌కు నా బౌలింగ్ వేగాన్నిమారుస్తూ వచ్చాను. ఆ వ్యూహం నాకు చాలా బాగా ఉపయోగపడింది. బంతి తిరుగుతున్నప్పుడు గాల్లో కాస్త నెమ్మదిగా వేయాలని నిర్ణయించుకున్నాను. నాపై నాకు నమ్మకంతో, సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసరడం పైనే పూర్తిగా దృష్టి పెట్టాను" అని దీప్తి వెల్లడించింది. గత కొన్ని మ్యాచ్‌లుగా వికెట్లు దక్కకపోవడంపై స్పందిస్తూ.. తాను ఎప్పుడూ వికెట్ల గురించి ఆందోళన చెందలేదని, సరైన సమయం వచ్చినప్పుడు జట్టు కోసం ఖచ్చితంగా రాణిస్తాననే నమ్మకం తనపై తనకు ఎప్పుడూ ఉందని స్పష్టం చేశారు.

అదే టర్నింగ్ పాయింట్... భారత బ్యాటర్లపై దీప్తి ప్రశంసలు:
బౌలింగ్‌లో తాను అదరగొట్టినప్పటికీ.. మ్యాచ్‌లో భారత జట్టుకు అసలైన ఊపు తెచ్చింది మాత్రం బ్యాటర్లేనని దీప్తి శర్మ కొనియాడారు. "ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ల మధ్య నెలకొన్న 91 పరుగుల భారీ భాగస్వామ్యం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఆ క్లిష్ట సమయంలో వారిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ మొత్తం మన వైపు తిరిగింది. అక్కడి నుంచే జట్టుకు అసలైన మొమెంటం లభించింది" అని దీప్తి ప్రశంసించారు.
ఇంగ్లాండ్‌లో లభించిన మద్దతు అద్భుతం
తనకు ఐసీసీ టోర్నమెంట్లు ఆడటం అంటే ఎంతో ఇష్టమని.. తన అంతర్జాతీయ కెరీర్ ప్రయాణం కూడా ఐసీసీ ఈవెంట్ నుంచే మొదలైందని దీప్తి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం గురించి చెబుతూ.. బర్మింగ్‌హామ్ మైదానంలో లభించిన ప్రేక్షకుల మద్దతును ఆమె ప్రత్యేకంగా అభినందించారు. "ఇక్కడికి ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి భారత జట్టుకు మద్దతు తెలపడం నిజంగా అద్భుతంగా అనిపించింది. ప్రతి మ్యాచ్‌లోనూ మాకు ఇలాంటి మద్దతే కావాలి. అభిమానులందరూ ఇలాగే మైదానాలకు వచ్చి టీమిండియాను ప్రోత్సహిస్తూనే ఉండాలి" అని దీప్తి శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications