దీపక్ చాహర్‌కు సుదీర్ఘ విశ్రాంతి.. ఏప్రిల్ వరకు దూరం?!!

ముంబై: టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ వచ్చే ఏప్రిల్ వరకు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. వెన్నుగాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సుదీర్ఘ విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 ఆరంభం నాటికి చాహర్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చాహర్‌ను ఏప్రిల్ వరకు జట్టుకు దూరంగా ఉంచుతున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.

ఐపీఎల్ వరకు దూరం?:
వచ్చే జనవరి నెలలో శ్రీలంక, ఆసీస్ జట్లతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీ చీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడాడు. 'దీపక్ చాహర్ వెన్నుగాయంతో సతమతమవుతున్నాడు. నాకు తెలిసినంత వరకు అతనికి సుదీర్ఘ విశ్రాంతి అవసరం. ఏప్రిల్ వరకూ చాహర్ జట్టుకు అందుబాటులోకి రాకపోవచ్చు' అని ఎమ్మెస్కే తెలిపాడు.

బలమైన బ్యాకప్ ఉంది:
'ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా అన్ని ఫార్మాట్లకు కలిపి బలమైన బ్యాకప్ ఉంది. ఇంకో ఆరేడేళ్లు ఈ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. చాహర్ దూరమయినా మనకు రిజర్వ్ పేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. చాహర్ కాకుండా ఫలానా ఆటగాడు లేడని చింతించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను న్యూజిలాండ్‌లో పర్యటించే భారత 'ఎ' జట్టుకు ఎంపిక చేశాం' అని ఎమ్మెస్కే అన్నాడు.

ఎలా రాణిస్తాడో చూడాలి:
'యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా ఎనిమిది నెలల నిషేధం తర్వాత ఇపుడే తిరిగి వచ్చాడు. అయితే అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందు ఇంకొన్ని మ్యాచ్‌లు ఆడడానికి సమయం ఇవ్వాలనుకుంటున్నాం. షా ఎలా రాణిస్తున్నాడనేది అక్కడ మనకు తెలుస్తుంది. భారత ఏ జట్టు మొత్తం ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దీంతో పృథ్వీ షాకు తగినంత సమయం లభిస్తుంది' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

బుమ్రా, హార్దిక్‌లు కూడా:
దీపక్ చాహర్ ఇటీవల వెస్టిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో వెన్నుగాయంతో సతమతమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో కటక్ వన్డేకు విశ్రాంతిని ఇచ్చారు. ఇతని స్థానంలో నవదీప్ సైనీ మూడో వన్డే ఆడాడు. ఇప్పుడు ఏకంగా సుదీర్ఘ విశ్రాంతి అవసరమైంది. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు వెన్నుగాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications