
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ తన భార్య జయ భరద్వాజ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఒక సూపర్ వీడియోను సోషల్ మీడియా వేదికగా ఆదివారం షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వివాహానికి ముందు సంగీత్ వేడుకకు సంబంధించినదని తెలుస్తోంది. ఇక వీరి వివాహం జూన్ 1న ఆగ్రాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు అతని బంధువులు, సన్నిహితులతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్స్, కొందరు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు కూడా హాజరయ్యారు.
ఇక తన వివాహంలో సంగీత్ ఫంక్షన్ సందర్భంగా దీపక్, జయ చేసిన డ్యాన్స్ వీడియోను అతను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో చాహర్, జయ మంచి మంచి స్టెప్పులేశారు. స్టెప్పులకు తగ్గట్లు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇచ్చారు. స్పెషల్ కాస్ట్యూమ్స్‌తో వీరిరువురు ఆకట్టుకునేలా కన్పించారు. ఇకపోతే చాహర్ ఈ వీడియోకు ఓ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. క్రికెట్ మ్యాచ్ కంటే ఎక్కువ ప్రెషర్ ఈ డ్యాన్స్ ద్వారా ఎదుర్కొన్నట్లు అతను పేర్కొన్నాడు. అంత ప్రెషర్‌లోనూ అతను బానే చేయడం గమనార్హం. ఇక దీపక్ సతీమణి జయ భరద్వాజ్ మాత్రం క్యూట్ భావాలను ఒలికిస్తూ సింగిల్‌గా అద్భుతంగా డ్యాన్స్ చేసింది.
ఇకపోతే వివాహం అనంతరం దీపక్ చాహర్ తన వివాహ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'నేను నిన్ను తొలిసారి కలిసింది మొదలు.. మదిలో నిన్నే నా అర్థాంగి అని ఫిక్సయ్యా. అది ఇప్పుడు నిజమైంది. మనము ఇప్పటివరకు మన జీవితంలోని ప్రతి క్షణాన్ని కలిసి ఆనందించాం. ఎప్పుడూ నిన్ను ఇలాగే సంతోషంగా ఉంచుతానని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా జీవితంలో అత్యుత్తమ క్షణాలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరూ మాకు మీ ఆశీర్వాదాలు అందించండి' అంటూ దీపక్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం వెన్ను గాయం నుండి దీపక్ కోలుకుంటున్నాడు. మరో మూడు లేదా నాలుగు నెలలపాటు జట్టుకు దూరం కానున్నాడు. దీంతో అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2022లో రూ.14కోట్ల భారీ మొత్తానికి చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. అయితే గాయం వల్ల అతను సీజన్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది.