
ముంబై: టీమిండియా మాజీ స్పిన్నర్ రమేష్ పొవార్ తిరిగి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా గురువారం ఎంపికయ్యారు. డబ్ల్యూవీ రామన్ స్థానాన్ని భర్తీ చేయనున్న పొవార్.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ బాధ్యతలు స్వీకరించనుండడం విశేషం. కొత్తగా కోచ్ పదవి కోసం రామన్‌తో సహా మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులకు ముఖాముఖీ నిర్వహించిన మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) 42 ఏళ్ల పొవార్ పేరును ప్రతిపాదించింది. ఆ తర్వాత కోచ్‌గా పొవార్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో పవార్, మిథాలీ రాజ్ మధ్య పాత గొడవ మళ్లీ చర్చకి వచ్చింది.
నిజానికి రెండేళ్ల క్రితం మహిళల జట్టు చీఫ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న రమేశ్ పొవార్ ఎక్కువ రోజుల నిలదొక్కుకోలేకపోయారు. 2018లో జరిగిన టీ20 ప్రపంచకప్ పొవార్ ఉద్వాసనకు ప్రధాన కారణమైంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీని తప్పించడం వెనుక కోచ్ పొవార్ కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే జట్టులో జరుగుతున్న దానిపై బీసీసీఐకి మిథాలీ ఓ లేఖ రాశారు. ముఖ్యంగా పొవార్ వ్యవహార శైలిపై మిథాలీ ఘాటుగా స్పందించారు. జట్టులో తనను అవమానపరిచే రీతిలో పొవార్ వ్యవహరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
మిథాలీ వ్యాఖ్యలపై పొవార్ కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. జట్టులో సభ్యుల మధ్య కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతూ గందరగోళం సృష్టించేందుకు మిథాలీ ప్రయత్నిస్తున్నదని.. వ్యక్తిగత రికార్డుల కోసమే ఆమె నెమ్మదిగా ఆడుతోందని పొవార్ చెప్పుకొచ్చారు. కెప్టెన్‌గా మిథాలీ మాటకు గౌరవమిచ్చిన బీసీసీఐ.. పొవార్‌ను చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పించింది. ఇక రెండేళ్ల విరామం తర్వాత పొవార్ మళ్లీ ఆ బాధ్యతలు స్వీకరించనునున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ దీప్‌దాస్ గుప్తా ఓ సూచన చేశారు. ఇద్దరూ ఒక్క ఫోన్ కాల్‌తో సమస్యని పరిష్కరించుకోవచ్చు కదా అని అన్నారు.
తాజాగా దీప్‌దాస్ గుప్తా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. 'మిథాలీ రాజ్, రమేశ్ పవార్ మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడ ఏదో జరిగిందని మనందరికీ తెలుసు. ఇప్పుడు మిథాలీ రాజ్ వన్డే టీమ్ కెప్టెన్. అంతేకాకుండా సీనియర్ బ్యాటర్ కూడా. కాబట్టి రమేశ్ పవార్‌తో గొడవని సాధ్యమైనంత తొందరగా ఆమె పరిష్కరించుకోవాలి. ఇద్దరిలో ఒకరు చొరవ తీసుకుని.. మొదట ఫోన్‌లో మాట్లాడుకుని భేదాభిప్రాయాల్ని తొలగించుకోవాలి. ఇదే సరైన మార్గం. అయితే మొదటి ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. ప్రస్తుతం జట్టు బాగుంది. ఇదొక్కటి సరిదిద్దుకుంటే సరిపోతుంది' అని అన్నారు.
రమేష్ పొవార్‌నే ఇప్పుడు ఎంపిక చేసిన నేపథ్యంలో.. అతనికి, మిథాలీకి మధ్య మంచి వాతావరణం ఉంటుందా? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఈ విషయంపై మదన్ లాల్ కూడా స్పందించారు. 'మిథాలీతో వివాదం గురించి ముఖాముఖిలో పొవార్‌ను అడిగాం. అందులో తన తప్పేమీ లేదని అతను చెప్పాడు. క్రికెటర్లందరితో కలిసి పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అని మాకు స్పష్టం చేశాడు' అని మదన్ లాల్ పేర్కొన్నారు.