ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపు సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ జట్టు గురించి మాట్లాడాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ సాధించలేకపోయామని, కానీ ఈ సారి చరిత్ర సృష్టిస్తామని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.
''సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేదు. గతంలో రెండు సార్లు విజయానికి దగ్గరగా వచ్చాం. ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి ఇదో మంచి అవకాశం. మా అత్యుత్తమ ఆట ఆడటానికి ప్రయత్నిస్తాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలో మా బౌలర్లు గొప్పగా రాణించారు. అయితే షమి లేకపోవడం మాకు తీరని లోటు. ఇక్కడ స్పిన్నర్ల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. మా దగ్గరు ఇద్దరు అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు''

''బ్యాటర్లకు ఇక్కడ సవాలుగా ఉంటుంది. సవాళ్ల కోసం మేం ఎదురుచూస్తుంటాం. తొలిసారి సఫారీ గడ్డ పర్యటనకు వచ్చిన వారికి కాస్త కఠినతరంగా ఉంటుంది. ఇక ప్రపంచకప్ కోసం చాలా కష్టపడ్డాం. ఫైనల్లో పైచేయి సాధించలేకపోయాం. ఆ బాధను మర్చిపోవడం చాలా కష్టం. కానీ ముందుకు సాగిపోవాలి. అందరి నుంచి మాకు మద్దతు దక్కింది. వ్యక్తిగతంతా అది నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. బ్యాటర్‌గా నా బాధ్యతను గొప్పగా నిర్వర్తించాలనుకుంటున్నా'' అని రోహిత్ అన్నాడు.
కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని రోహిత్ శర్శ క్లారిటీ ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్ మిడిలార్డర్‌లో గొప్పగా రాణించాడని ప్రస్తావించాడు. అలాగే షమి స్థానంలో ముకేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుందని చెప్పాడు.
అయితే మీడియా సమావేశంలో ఓ విలేఖరి.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పరోక్షంగా అడిగాడు. దానికి రోహిత్ తెలివిగా బదులిచ్చాడు. ''నా నుంచి ఎలాంటి సమాధానం కోరుకుంటున్నారో నాకు తెలుసు. త్వరలోనే దానికి జవాబు దొరుకుతుంది'' అని రోహిత్ నవ్వుతూ చెప్పాడు.