ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై భారత్ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. ఎనిమిది సార్లు సౌతాఫ్రికాలో పర్యటించినా 2010లో డ్రాతో సిరీస్ ముగించడమే అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ సారి అయినా సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా బరిలోకి దిగింది. కానీ సెంచూరియన్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. కేఎల్ రాహుల్ (70*) పోరాటంతో టీమిండియా కాస్త పోటీలో నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(5), యశస్వీ జైశ్వాల్ (17), శుభ్‌మన్ గిల్ (2) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి (38), శ్రేయస్ అయ్యర్ (31) జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. అయితే లంచ్ బ్రేక్ అనంతరం రబాడ చెలరేగి శ్రేయస్, కోహ్లిని ఔట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.

ఆ తర్వాత వచ్చిన అశ్విన్ (8) కూడా ఔటవ్వడంతో టీమిండియా 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ కేఎల్ రాహుల్ గొప్పగా పోరాడాడు. శార్దూల్ ఠాకూర్ (24), బుమ్రా (1)తో కలిసి పరుగులు సాధిస్తూ భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. రాహుల్ ఇన్నింగ్స్‌తోనే టీమిండియా తొలి రోజు ఆట ముగిసేసరికి 208 పరుగులు చేసింది.
అయితే డిసెంబర్ 26న దక్షిణాఫ్రికాపై రాహుల్ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడటం ఇది రెండోసారి. 2021లో సౌతాఫ్రికాపై అదే రోజున సెంచరీ సాధించాడు. 123 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. అతడు టెస్టుల్లో అరంగేట్రం చేసింది కూడా డిసెంబర్ 26నే కావడం విశేషం. సరిగ్గా ఇప్పుడు కూడా డిసెంబర్ 26నే రాహుల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడి సత్తాచాటాడు. దీంతో నెటిజన్లు డిసెంబర్ 26న రాహుల్ డే గా ప్రకటించాలని కామెంట్లు చేస్తున్నారు.