
హైదరాబాద్: భారత్‌తో ఎంతో కీలకమైన టెస్టు సిరీస్‌కి ముందు దక్షిణాఫ్రికా జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. జింబాబ్వేతో ప్రయోగాత్మకంగా మంగళవారం ప్రారంభమైన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడుతూ అతడు గాయపడ్డాడు.
దీంతో డికాక్ స్థానంలో ప్రస్తుతం జట్టుకు తాత్కాలిక కెప్టెన్ ఉన్న ఏబీ డివిలియర్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. డికాక్ తొడ కండరాలకి గాయమైందని.. భారత్‌తో కేప్ టౌన్ వేదికగా జరిగే తొలి టెస్టుకు అతడు అందుబాటులో ఉండటంపై అనుమానంగా మారింది.
'ప్రస్తుతం డీకాక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఫిజియో సూచన మేరకు జింబాబ్వేతో జరుగుతున్న నాలుగు రోజుల టెస్టుకి దూరమయ్యాడు. కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరిగే తొలి టెస్టుకి అతను అందుబాటులో ఉండటంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం' అంటూ క్రికెట్ దక్షిణాఫ్రికా అధికార ప్రతినిధి వెల్లడించారు.
కాగా, జట్టు రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ పూర్తి స్థాయిలో ఫిటెనెస్ సాధించలేకపోవడంతో జింబాబ్వే టెస్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతలను డివిలియర్స్‌కు అప్పగించారు. ఇప్పుడు డీకాక్ కూడా తప్పుకోవడంతో డివిలియర్స్ కెప్టెన్‌తో పాటు కీపర్ అవతారమెత్తాడు.
వెన్నునొప్పి కారణంగా గత ఏడాదన్నర నుంచి కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతూ విశ్రాంతి తీసుకున్న ఏబీ డివిలియర్స్ ఇటీవలే టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల ఏకైక టెస్టులో రెండు రోజులు కూడా పూర్తిగా సాగకుండా ఫలితం వచ్చేసింది.
దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన ముందు జింబాబ్వే తేలిపోయింది. బుధవారం ముగిసిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండు రోజుల్లో కలిపి 176 ఓవర్లు ఆడాల్సి ఉంటే మ్యాచ్ 151.1 ఓవర్లకే ఫలితం వచ్చింది. దీంతో అతి తక్కువ బంతుల్లో (907) టెస్ట్ మ్యాచ్‌ను గెలిచిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది.
