కోల్‌కతా: డిడిసిఎ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే, జైట్లీకి భారత టాప్ క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ తదితరులు జైట్లీపై ప్రశంసలు గుప్పించారు.
తాజాగా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా జైట్లీకి అండగా నిలబడ్డారు. ఎన్నికల ద్వారా ఎన్నికోబడిన వారే రాజకీయ నాయకులు అని, ఎవరు కూడా మరొకరి పవర్స్‌ను సవాల్ చేయలేరన్నారు.
భారత వన్డే, టీ20 సారథి మహేంద్ర సింగ్ ధోనీ పైన గంగూలీ ప్రశంసలు కురిపించారు. ధోనీ గొప్ప క్రికెటర్ అని, అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడన్నారు. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా ధోనీలో ఉందన్నాడు. ధోనీ స్థాయికి ఎవరైనా చేరుకోవాలంటే ప్రతిభతో పాటు, కఠోర శ్రమ కూడా అవసరమన్నాడు.

2019లో జరిగే ప్రపంచ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఎవరు ఉండవచ్చన్న దానిపై స్పందిస్తూ... అది నిర్ణయించడానికి ఇంకా చాలా సమయముందన్నాడు.
చాలాకాలం తర్వాత భారత జట్టులో స్థానం దక్కించుకున్న ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విషయమై మాట్లాడుతూ... ఆస్ట్రేలియా పర్యటనలో అతను రాణిస్తాడన్నారు. పాకిస్తాన్, భారత్‌లు మళ్లీ ఆడాలనే అందరూ కోరుకుంటున్నారని, అయితే దీనికి సంబంధించిన నిర్ణయాధికారం బీసీసీఐ చేతిలో లేదని, కేంద్రం చేతిలో ఉందన్నారు.