ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఒక విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డీసీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెలరేగాడు. ఆరంభం నుంచే భారీ షాట్లతో కేకేఆర్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకప్పటి తన బెస్ట్ ఆట ఇంకా తనలో మిగిలే ఉందని నిరూపించాడు.
ఈ సీజన్ ఆరంభం అయినప్పటి నుంచి వార్నర్ రాణిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. కానీ అతను హాఫ్ సెంచరీలు చేయడానికి తీసుకున్న బంతులు పెద్ద తలనొప్పిగా మారాయి. భారీ ఛేజింగ్‌లో కూడా జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడీ ఆస్ట్రేలియా దిగ్గజం. ఈ క్రమంలో అతని స్లో బ్యాటింగ్‌పై విమర్శల వర్షం కురిసింది.

టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే మొహమాటం లేకుండా వార్నర్‌ను ఏకిపారేశాడు. ఇలా ఆడే పనైతే అసలు ఐపీఎల్‌కు రావొద్దని, ఈ ఆట పూర్తిగా వేస్ట్ అని చెప్పేశాడు. చాలా మంది అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేకేఆర్ మ్యాచ్‌లో తన ఆటతీరు చూపించిన అనంతరం.. ఈ విమర్శలపై డేవిడ్ వార్నర్ స్పందించాడు.
'నేను నార్మల్‌గా ఆడే స్టైల్‌లో బ్యాటింగ్ చేయడం లేదని చాలా మంది విమర్శలు చేశారు. ఆ విషయం నాక్కూడు తెలుసు. కానీ రెండు ఓవర్లలో వరుసగా మూడు వికెట్లు కోల్పోతే ఏం చెయ్యాలి? నేను కేవలం మూడు బంతులే ఫేస్ చేసేసరికి మూడు వికెట్లు పోయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అలాంటి సమయంలో మనం ఏం చెయ్యలేం. మనకు కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా' అని చెప్పాడు.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ పెద్దగా రాణించలేదు. ఆ విషయాన్ని కూడా అతను గుర్తుచేసుకున్నాడు. 'బెంగళూరులో నేను అవుట్ అయినప్పుడు చాలా మంది నన్ను విమర్శించి ఉంటారు. కానీ దానికి మనం ఏం చెయ్యలేం. ఈ ఆట అలాంటిది' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తన సహజమైన ఆటతీరులో ఆడానని, తన రిథమ్ తిరిగొచ్చినట్లు ఫీల్ అయ్యానని వార్నర్ పేర్కొన్నాడు.