యాక్సిడెంట్ కారణంగా ఐపీఎల్ 2023కు దూరమైనా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషభ్ పంత్ ఎంతో కీలకమైన ఆటగాడని, అతను జట్టుకు గుండె వంటి వాడని డీసీ ఫ్రాంచైజీ నమ్ముతోంది. ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా కొన్నిరోజుల క్రితం ఇదే చెప్పాడు. ఈ క్రమంలోనే పంత్ జెర్సీని తమ డగౌట్‌లో పెట్టుకొని తొలి మ్యాచ్ ఆడిన ఢిల్లీ ఓటమిపాలైంది. లక్నో చేతిలో చిత్తుగా ఓడింది.
అయితే ఈ సీజన్‌లో తమ సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడేందుకు ఆ టీం రెడీ అవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఈ మ్యాచ్ కోసం డీసీ గట్టిగా రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు అన్నింటినీ సరిదిద్దుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. డీసీ రెండో మ్యాచ్ చూసేందుకు రిషభ్ వస్తాడట.

యాక్సిడెంట్‌లో మోకాళ్లకు తీవ్రమైన గాయాలు అవడంతో పంత్‌కు పలు శస్త్ర చికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంత్‌కు నడవడం కూడా కష్టంగా మారింది. ఇప్పుడిప్పుడే అతను కోలుకుంటున్నాడు. అయితే అతనే తమ జట్టు గుండె అని చెప్పుకుంటున్న డీసీ.. తమ జట్టుకు మద్దతుగా అతన్ని స్టేడియానికి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ విభాగం అనుమతి తీసుకొని అవసరమైతే పంత్‌ను తమ డగౌట్‌లో కూర్చోబెట్టాలని డీసీ భావిస్తోంది.
సాధారణంగా బయటి వ్యక్తులను ఆటగాళ్ల డగౌట్‌లకి రానివ్వరు. కానీ ఢిల్లీ మాత్రం ఏదో ఒకటి చేసి బీసీసీఐని ఒప్పించాలని, డగౌట్‌లో పంత్‌ను కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై డీసీ చాలా కసరత్తులు చేస్తోంది. ఏదేమైనా అభిమానులు కూడా డీసీ మ్యాచుల్లో పంత్‌ను మిస్ అవుతున్నారు. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి పంత్ లేపోడమే కారణం అని చెప్పారంటేనే అతని పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పంత్‌ను డగౌట్‌కు తీసుకొస్తే అభిమానులు కూడా తెగ సంతోషిస్తారని డీసీ అనుకుంటోంది.